సినీ పరిశ్రమ నుంచి ఒకే ఒక్కడు! మంత్రి పేర్నినానితో ఆర్.నారాయణమూర్తి చర్చ!
ఏపీ సినిమా పరిశ్రమలో నెలకొన్న వివాదాలపై సీఎం జగన్ ప్రభుత్వంతో చర్చించడానికి ఒకే ఒక్కడు ముందుకు వచ్చాడు. ఎర్ర సినిమాలు తీసే నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి చొరవ తీసుకుని ముందడుగు వేశాడు.
ఏపీ మంత్రి పేర్ని నానిని సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి కలిశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రిని కలిసిన నారాయణమూర్తి సినీ రంగాలకు చెందిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. టికెట్ల రేట్ల పెంపు, థియేటర్ల మూసివేత వంటి విషయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో నారాయణమూర్తి మంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. థియోటర్లు మూతపడటంపై తీవ్రంగా చలించిపోయిన ఆర్. నారాయణ మూర్తి జగన్ ప్రభుత్వంతో మాట్లాడటానికి వచ్చారు.
అయితే, ఇప్పటికే ఏపీలో సినిమా థియేటర్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. సీల్ వేసిన థియేటర్లను మళ్లీ తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. నెల రోజుల్లో థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలంటూ ఆదేశించింది. ఇందుకోసం జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని థియేటర్ల యజమానులను సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఆదేశించారు. దీంతో 9 జిల్లాల్లోని 83 థియేటర్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. నిర్దేశించిన టికెట్ల రేట్ల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని. నియమాలు అతిక్రమిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దాడులు చేసి థియేటర్లను మూసివేసింది.