బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 19 డిశెంబరు 2022 (18:25 IST)

బచ్చలికూర తిని ఆసుపత్రిలో చేరిన 9 మంది.. కూర తిన్నాక లేనిది ఉన్నట్లు అనిపిస్తోందంటున్న రోగులు

Spinach
బచ్చలి కూర కారణంగా ఆస్ట్రేలియాలో కొందరు ఆసుపత్రిపాలయ్యారు. విషపూరితమైన బచ్చలి కూర తిన్నవారంతా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. కోస్ట్‌కోకు చెందిన రివేరా ఫార్మ్స్ కంపెనీ బచ్చలికూర తిన్న తర్వాత తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అనారోగ్యానికి గురైన వారిలో లేనిది ఉన్నట్లుగా మతి భ్రమించడం, గుండె కొట్టుకునే రేటు పెరగడం, మసకమసకగా కనిపించడం వంటి లక్షణాలు ఉన్నాయని వారికి చికిత్స చేసిన ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

 
కలుపు మొక్కల కారణంగా ఆ బచ్చలి కూర మొక్కలు కలుషితమై ఉంటాయని రివేరా ఫార్మ్స్ చెబుతోంది. మిగతా అన్ని ఉత్పత్తులు బాగానే ఉన్నాయని తెలిపింది. డిసెంబర్ 16‌ గడువు తేదీతో ఉన్న ఈ బ్రాండ్ బచ్చలికూరను తినడం సురక్షితం కాదని, ఆ ప్యాకెట్లను బయట పడేయాలని న్యూ సౌత్ వేల్స్ ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. బచ్చలి కూర తిన్న తర్వాత అసాధారణంగా అనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేరాలని ప్రజలకు సూచించారు.

 
‘‘ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదు. అయితే, కొంతమంది ఇంకా అనారోగ్యంతో ఉన్నారు. బచ్చలి కూర తిని ఆసుపత్రి పాలైనవారిలో కొందరికి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు భ్రమ కలుగుతోంది’’అని పాయిసన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు చెందిన డాక్టర్ డారన్ రాబర్ట్స్.. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్తా పత్రికతో చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి వెంటనే తాము చర్యలు తీసుకున్నామని రివేరా ఫార్మ్స్ అధికార ప్రతినిధి చెప్పారు.

 
ఆ కలుషిత బచ్చలి కూరను వెంటనే తమ షాపుల్లో నుంచి బయటపడేయాలని సూచించినట్లు వివరించారు. మిగతా ఎక్కడా ఇలా కలుషిత బచ్చలి తిని ఆసుపత్రి పాలైనట్లు తమకు సమాచారం అందలేదని ఆయన వివరించారు. ప్రస్తుతం బాధితులంతా సిడ్నీకి చెందినవారేనని ఎన్ఎస్‌డబ్ల్యూ హెల్త్ వెల్లడించింది. వెంటనే ఇతర రాష్ట్రాల్లోని అధికారులు కూడా అప్రమత్తం అయినట్లు పేర్కొంది.