సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (18:26 IST)

సౌరవ్ గంగూలీ.. నాయకుడిగా నడిపించగలడా.. రాజకీయాలను ఎదుర్కోగలడా?

సౌరవ్ గంగూలీ... భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకోబోతున్నాడు.
 
భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంలా, క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధిస్తారు అభిమానులు.
 
ఈ దేవుళ్లను నియంత్రించే కొందరు పెద్దలు కూడా ఉన్నారు... వారే భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు.
 
ప్రపంచంలోనే సంపన్న క్రీడా బోర్డుల్లో బీసీసీఐ ఒకటి. అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాలను ప్రభావితం చేయగల శక్తిమంతమైన బోర్డు ఇది. అందువల్లే బీసీసీఐ ఏర్పాటైన నాటి నుంచీ ఇప్పటివరకూ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలే దీనికి సారథ్యం వహిస్తూ వచ్చారు.
 
బీసీసీఐలో ఉండటం అంటే... కోట్లాది మందిని అలరించే క్రికెట్ క్రీడను నియంత్రించడమే. దీంతో, మీడియాలో కూడా బాగా పేరు, ప్రాచుర్యం వస్తుంది. భారత్‌లో ఎన్ని క్రీడలున్నా క్రికెట్‌దే ఆధిపత్యం. ఇక ఈ క్రీడను నియంత్రించగలగడం, వ్యవహారాలను పర్యవేక్షించగలగడం అంటే అంతకన్నా కావలసింది ఏముంటుంది!
 
క్రికెట్ పరిపాలనా వ్యవహారాల్లో 2017లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం గంగూలీకి ఎన్నికకు మార్గం పడేలా చేసింది.
 
ఐపీఎల్ టోర్నమెంట్లో స్పాట్ ఫిక్సింగ్, బోర్డులో అవినీతి ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.
 
బీసీసీఐలోని రాజకీయ నాయకులు (ప్రస్తుత ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్) అందరూ వెంటనే రాజీనామా చేయాలని ఆదేశిస్తూ, బీసీసీఐని నడిపించడానికి, సంస్కరణలు తీసుకురావడానికి కొందరు సభ్యులతో కూడిన పరిపాలక కమిటీని ఏర్పాటుచేసింది.
 
కొత్త ఇన్నింగ్స్ 
భారత క్రికెట్ చరిత్రలో బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక ఓ కొత్త అధ్యాయంగా భావించవచ్చు. ఓ ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించిన గంగూలీపై అభిమానులు కూడా చాలా ఆశలే పెట్టుకున్నారు.
 
భారత జట్టు సంక్షోభంలో ఉన్న సమయంలో.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో సీనియర్ ఆటగాళ్లు ఉద్వాసనకు గురై.. అభిమానుల ఆశలన్నీ నీరుగారిపోయిన తరుణంలో జట్టు పగ్గాలు చేపట్టి, గాడినపెట్టి, విజయవంతమైన జట్టుగా రూపొందేలా చేసిన గంగూలీకి సవాళ్లు ఎదుర్కోవడం కొత్తేం కాదు.
 
అప్పట్లో.. మేమింక క్రికెట్ చూడాలని అనుకోవడం లేదంటూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. జట్టులో కూడా అన్నీ కొత్తముఖాలే.
 
కానీ జట్టు బలహీనతలను బలాలుగా మార్చడంలో గంగూలీ సఫలమయ్యాడు.
 
యువ క్రికెటర్లను సానబట్టి, వారిపై నమ్మకాన్ని ఉంచాడు. ఎవరైనా కవ్వింపు చర్యల (స్లెడ్జింగ్)కు దిగితే అంత కన్నా ఎక్కువగా స్లెడ్జింగ్ చేయాలని తన సహచర క్రికెటర్లకు చెప్పాడు. ఒత్తిడికి గురిచేయాలన్న ప్రత్యర్ధి జట్ల ఉచ్చులో పడొద్దని సూచించాడు.
 
మైదానంలో ఎప్పుడూ నెమ్మదిగా, శాంతంగా ఉంటారనే పేరున్న భారత క్రికెట్ జట్టు సభ్యులను దూకుడుగా మార్చిన, ఆటగాళ్లకు అందుకు అవసరమైన స్వేచ్ఛనిచ్చిన ఘనత గంగూలీదే.
 
ఈ వ్యూహం ఫలించింది... భారత జట్టు సొంతగడ్డపైనే కాకుండా విదేశాల్లో కూడా విజయాలు సాధించడం మొదలైంది.
 
ఈ విజయాల్లో గంగూలీ జట్టును ఓ నాయకుడిగా ముందుండి నడింపించాడు. దీంతో అతడిపై జట్టులో గౌరవం పెరిగింది. దశాబ్దం పాటు గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్, సచిన్, ద్రవిడ్‌లతో కూడిన బృందం భారత్ బ్యాటింగ్‌లో ఆధిపత్యం చెలాయించింది.
 
ఆ తర్వాత పరిణామాలు గంగూలీకి వ్యతిరేకంగా పరిణమించాయి.
 
తాను కోరి ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్న కోచ్ గ్రెగ్ చాపెల్‌తో బహిరంగ విభేదాలు అతడిని టీం నుంచి దూరమయ్యేలా చేశాయి. మొదట కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత జట్టు నుంచే ఉద్వాసనకు గురయ్యాడు.
 
కానీ, అనూహ్యంగా... మళ్లీ దేశవాళ్లీ క్రికెట్లో ఆడుతూ పరుగుల ప్రవాహాన్ని సృష్టించాడు. దీంతో సెలక్టర్లకు గంగూలీని జాతీయ జట్టులోకి ఎంపిక చేయక తప్పని పరిస్థితిని కల్పిచాడు. ఆ తర్వాత 2008లో ఆటకు గుడ్ బై చెప్పాడు.
 
గంగూలీ ముందున్న సవాళ్లేంటి? 
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నికను చాలామంది మాజీ క్రికెటర్లు, అభిమానులు, అధికారులు ప్రశంసించారు. అతడికి శుభాకాంక్షలు తెలిపారు.
 
ఓ గొప్ప క్రికెటర్ బోర్డుకు సారథ్యం వహించడం ఆటకు శుభపరిణామం అని వాళ్లంతా అభిప్రాయపడ్డారు. కచ్చితంగా అది నిజమే.
 
కానీ, ఓ క్రికెటర్‌గా, కెప్టెన్‌గా అద్భుతాలు చేసిన గంగూలీ... బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా మ్యాజిక్ చేయగలుగుతాడా?
 
గంగూలీ తప్పుడు వ్యాఖ్యలు చేసే వ్యక్తి కాదు. ప్రస్తుత జట్టు ఆటతీరుపై విలేకరులు ప్రశ్నించినప్పుడు గంగూలీ చెప్పిన సమాధానం ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.
 
ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయాలను ప్రశంసిస్తూనే... కోహ్లీ సారథ్యంలోని జట్టు పెద్ద టోర్నీల్లో విఫలమవుతోందని అన్నాడు.
 
"జట్టు ఆటతీరు సంతృప్తికరంగానే ఉంది. మనకు మంచి జట్టు ఉంది. కానీ మనం పెద్ద టోర్నీల్లో విజయాలు సాధించాల్సి ఉంది. ప్రతిసారీ గెలవాలని నేను చెప్పట్లేదు. అది సాధ్యం కాదు కూడా. కానీ మన జట్టు ఏడు పెద్ద టోర్నీల్లో పాల్గొన్నా ఒక్కటి కూడా గెల్చుకోలేకపోయింది. ప్రత్యర్థుల కన్నా మన జట్టు చాలా బలంగా ఉంది కూడా" అని గంగూలీ సమాధానమిచ్చాడు.
 
ఇప్పటివరకూ కోహ్లీ - శాస్త్రి ద్వయం జట్టును సాధికారికంగా నడిపించారు. సెలక్షన్ కమిటీ సమావేశాల్లో, ఎవరెవరిని జట్టుకు ఎంపిక చేయాలనే నిర్ణయాల్లో కూడా వీరిద్దరిదే ఆధిపత్యమనే వార్తలు కూడా వచ్చాయి. కోచ్‌గా అనిల్ కుంబ్లే నిర్ణయాలతో కోహ్లీ విభేదించడమే అతడు పదవి నుంచి తప్పుకోవడానికి కారణమని కూడా వ్యాఖ్యలు వినిపించాయి. గతంలో కూడా గంగూలీ, శాస్త్రిలిద్దరూ అనేక అంశాలపై బహిరంగంగానే విభేదించుకున్నారు.
 
ఇప్పుడు కోచ్, కెప్టెన్.. కొత్త అధ్యక్షుడిగా ఎలా పనిచేస్తారనేది ఆసక్తిగా మారింది.
 
బీసీసీఐ పాలనా వ్యవహారాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని గంగూలీ కూడా ఎదుర్కోక తప్పదు.
 
అతడి ఎన్నికకు కారణం... బీసీసీఐలోకి వెనక వైపు నుంచి రాజకీయ నాయకుల ప్రవేశానికి మార్గం వేసుకోవడమే.
 
గంగూలీ ఎన్నికకు హోంశాఖ మంత్రి అమిత్ షా మార్గం సుగమం చేశారని మీడియా కథనాలు చెబుతున్నాయి. గంగూలీ నామినేషన్ వేయడానికి ముందుకు షాతో భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. కానీ ఈ సమావేశం గంగూలీ అభ్యర్థిత్వం గురించి కాదని ఇద్దరూ కూడా దీనిపై వచ్చిన వ్యాఖ్యలను ఖండించారు.
 
గంగూలీతోపాటు బోర్డులో జై షా (అమిత్ షా కుమారుడు) కార్యదర్శిగా, అరుణ్ ధుమాల్ (అనురాగ్ ఠాకూర్ సోదరుడు) ట్రెజరర్‌గా ఉండబోతున్నారు.
 
క్రికెట్ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఉండదు అని ప్రజలు, అభిమానులు అనుకునేలా చేయడమే గంగూలీ ముందున్న పెద్ద సవాలు.
 
కానీ, అతడికి ఉన్న సమయం కేవలం 10 నెలలే.
 
బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం బోర్డులో కానీ, అనుబంధ రాష్ట్ర బోర్డుల్లో కానీ ఆరేళ్ల కన్నా ఎక్కువ సమయం పదవిలో ఉండటానికి వీల్లేదు. గంగూలీ ఇప్పటికే బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఐదేళ్లకు పైబడి పదవిలో కొనసాగుతున్నాడు.
 
గంగూలీ హయాంలో ఊహించని మార్పులు జరిగే అవకాశముందని అతని గత చరిత్ర చూస్తే తెలుస్తుంది. మరి, తక్కువ సమయంలో ఈ సవాళ్లను గంగూలీ ఎదుర్కోగలడా? సమాధానం కోసం వచ్చే 10 నెలలు ఎలా ఉంటాయో చూడాలి.