శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 4 జనవరి 2021 (13:13 IST)

ఐఫోన్‌ విడిభాగాల ఫ్యాక్టరీ: ‘అన్నీ పోను రూ. 500 నెల జీతం’, అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా?

ప్రముఖ సంస్థ యాపిల్‌ కంపెనీకి చెందిన ఐ ఫోన్ల కోసం విడిభాగాలను తయారు చేసే సంస్థ ‘విస్ట్రన్’లో జరిగిన విధ్వంసం అంతర్జాతీయంగా చర్చనీయమైంది. కార్మికులు అధికారులపై, సంస్థ ఆస్తుల మీదా దాడికి దిగడం సంచలనంగా మారింది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఈ సంస్థ కర్మాగారం ఉంది.

 
డిసెంబర్‌ 12న జరిగిన ఈ ఘటనకు ప్రధాన కారణాలేమిటి, కార్మికులు ఏం చెబుతున్నారు, యాజమాన్యం వాదన ఏంటి అన్నది తెలుసుకునేందుకు కోలార్‌ ప్రాంతంలో బీబీసీ పర్యటించింది.

 
విధ్వంసానికి దారితీసిన నిరసన
డిసెంబర్ 12 తెల్లవారుజామున ఉదయం 5.45 నిమిషాలకు రాత్రి షిఫ్ట్‌ కార్మికులు బయటకురావడం, పగటిపూట కార్మికులు లోపలికి వెళ్లడానికి సిద్దమవుతున్నవేళ కలకలం మొదలైంది. కొందరు కార్మికులు అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల ప్రతినిధులను నిలదీసేందుకు ప్రయత్నించారు. అలా మొదలైన వివాదం కొందరు అధికారులు ప్రవర్తించిన తీరుతో విధ్వంసానికి దారి తీసింది.

 
అధికారులపైనా, సంస్థ ఆస్తులపైనా కార్మికులు దాడి చేశారు. దీంతో కంపెనీకి ఆస్తి నష్టం వాటిల్లింది. కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి డిసెంబర్‌ 12 ఉదయం 11 గంటలకు ఆందోళనకు సన్నాహాలు చేసుకున్నారు. అప్పటికి రెండు నెలల ముందు నుంచి తమ సమస్యలను కోలార్‌ జిల్లా అధికారులకు విన్నవించుకుంటూనే ఉన్నారు.

 
వేతనాలు, పనిగంటలు, కార్మికులపై వేధింపులు తదితర సమస్యలపై వారంతా అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయితే అటు నుంచి తగిన స్పందన లేకపోవడంతో నిరసనలకు దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే తెల్లవారుజామునే నిరసన తెలిపే ప్రయత్నం జరగడం, అది గొడవకు దారితీయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ గొడవకు కారకులు ఎవరన్నది ఇప్పటి వరకూ తేలలేదని కోలార్‌ జిల్లా ఎస్పీ బీబీసీకి తెలిపారు.

 
విద్యార్థులే కార్మికులుగా..
తైవాన్‌కు చెందిన విస్ట్రన్‌ కంపెనీ కోలార్ సమీపంలోని నర్సాపుర పారిశ్రామిక ప్రాంతంలో యూనిట్‌ను నెలకొల్పింది. యాపిల్‌తోపాటు వివిధ కంపెనీలకు సరఫరా చేసే విడిభాగాలను ఏడాదిన్నరగా అక్కడ తయారుచేస్తున్నారు. విస్ట్రన్ కంపెనీలో సిబ్బంది నియామకాలను అవుట్‌ సోర్సింగ్‌ ఏజన్సీలకు అప్పగించారు.

 
కోలార్ సమీపంలో ఉన్న యూనిట్‌ కోసం ఆరు అవుట్‌ సోర్సింగ్‌ సంస్థలు ఈ బాధ్యతను నిర్వహిస్తున్నాయి. ఘటన జరిగిన నాటికి 1330మంది శాశ్వత ఉద్యోగులు, దానికి 6 రెట్లమంది తాత్కాలిక సిబ్బంది యూనిట్‌లో పని చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో స్థానికులైన 8,500మంది వరకూ అందులో పనిచేస్తున్నారని సంస్థ వెల్లడించింది.

 
పర్మనెంట్ ఉద్యోగులు స్థానికేతరులుకాగా, కాంట్రాక్ట్‌ కార్మికులు మాత్రం స్థానికులే. అందులోనూ ఎక్కువమంది విద్యార్దులే. కరోనాతో విద్యాసంస్థలు మూతపడడంతో, చదువులు లేక ఇంటి దగ్గర ఉంటున్న విద్యార్దులకు తక్కువ జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నారని కోలార్‌ సమీపంలోని నాగులపురకి చెందిన ఎం.జీవన్ బీబీసీతో అన్నారు.

 
“సెల్‌ఫోన్‌ కంపెనీలో పని ఉందని ఫ్రెండ్‌ ద్వారా తెలుసుకుని వెళ్లాను. లాక్‌డౌన్‌ నడుస్తున్న కాలంలో కూడా కంపెనీ పని చేసింది. నేను మే నెలలో చేరాను. చాలామందిని మే తర్వాత చేర్చుకున్నారు’’ అని జీవన్ అన్నారు. “నెలకు రూ. 12 వేలు ఇస్తామని చెప్పారు. రోజుకు 12 గంటలు పని చేయించుకునేవారు. కానీ జీతాలు మాత్రం సరిగా ఇచ్చేవారు కాదు. బస్సు ఛార్జీలు, మెస్సు ఛార్జీలు, లేట్‌ పంచ్‌లు అంటూ రకరకాల పేర్లు చెప్పి రావాల్సిన జీతంలో సగం కూడా ఇవ్వలేదు’’ అన్నారు జీవన్‌. “ఇచ్చే జీతం కూడా నెలల తరబడి ఆలస్యం. ఎవరితో చెప్పుకోవాలో అర్ధమయ్యేది కాదు’’ అన్నారాయన.

 
సోషల్‌ మీడియా సాయంతో సంఘటితం
పేరుకు అంతర్జాతీయ సంస్థ అయినా, కార్మికుల నియామకానికి మాత్రం ఏజెన్సీలపై ఆధారపడింది విస్ట్రన్. అయితే ఏజెన్సీలు వ్యవహారశైలే కార్మికుల్లో ఆగ్రహానికి కారణమైందని కోలార్‌ అధికార యంత్రాంగం భావిస్తోంది. ఏజెన్సీలకు, విస్ట్రన్‌ కంపెనీకీ కార్మికులు తమ సమస్యలను తెలియజేసినా వారు సకాలంలో స్పందించలేదని కోలార్‌ జిల్లా సీఐటీయూ నేత విజయ్‌కృష్ణన్‌ బీబీసీతో అన్నారు.

 
“విదేశీ కంపెనీలు వచ్చినా కార్మికుల నియామకం, ఇతర విషయాల్లో దేశీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు లాభాపేక్షతో కార్మికుల జీవితాలతో ఆడుకున్నాయి. కనీస పనిగంటలు అమలు కాలేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాక వారంతా వాట్సాప్‌ గ్రూపుల ద్వారా దీనిపై చర్చించారు’’ అని కృష్ణన్‌ వెల్లడించారు.

 
“కొందరు జిల్లా లేబర్‌ కమిషనర్‌తోపాటు కలెక్టర్‌ను కూడా కలిశారు. స్పందన లేకపోవడంతో ఆందోళనలు, నిరసనలకు సిద్ధమయ్యారు. కార్మికులు ఏకమవుతున్నారని తెలిసి అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు అతిగా వ్యవహరించాయి. దీంతో పెద్ద ఘర్షణ జరిగింది’’ అన్నారు కృష్ణన్‌.

 
మహిళా కార్మికులపై వేధింపులు
విస్ట్రన్‌ యూనిట్‌లో పని చేస్తున్న మహిళా కార్మికులపై వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు కార్మికులు బీబీసీకి చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి యూనిట్‌ వరకు కార్మికులను 5.40కల్లా చేర్చాలంటే తెల్లవారుజామున 3 గంటలకే కార్మికులు ఇంటి నుంచి బయలుదేరాల్సి వచ్చేదని, ఇలా ఎంతో కష్టపడి వస్తున్న మహిళలపై వేధింపులుండేవని వారు వెల్లడించారు.

 
“ఇక్కడ ఎక్కువమంది కార్మికులు విద్యార్దులే. పని చేసే ప్రదేశంలో మహిళలపై వేధింపులు ఎక్కువ. 12గంటల పనిలో కేవలం రెండుసార్లే వాష్‌ రూమ్‌కు వెళ్లడానికి అనుమతి ఇస్తున్నారు’’ అని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.ఎఫ్‌.ఐ) నేత శ్రీకాంత్‌ బీబీసీతో అన్నారు. “పీరియడ్స్‌, ఇతర సమస్యలున్న మహిళల పరిస్థితి దారుణంగా ఉండేది. బస్సుల్లో కూడా మహిళలపై ఆకతాయిల వేధింపులు ఉంటున్నాయి. వారికి రక్షణ కల్పించాలని సూచించినా యాజమాన్యంలోగానీ, ఏజెన్సీలోగానీ స్పందన లేదు’’ అన్నారు శ్రీకాంత్‌.

 
అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలపై ఫిర్యాదులు
నియామక ప్రక్రియలోనూ విస్ట్రన్‌ కంపెనీ అనేక నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. “నిబంధనల ప్రకారం వచ్చే మార్చినాటికి పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టాల్సి ఉన్నా, తక్కువమందితో పనులు చేయిస్తున్నారు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని విస్ట్రన్‌ కంపెనీ ప్రతినిధి ఒకరు బీబీసీకి వెల్లడించారు.

 
“13వేలమంది సిబ్బందితో పరిశ్రమ నడపాల్సి ఉన్నప్పటికీ 10వేలమందితోనే యూనిట్ పూర్తి సామర్థ్యం దశకు చేరుకుంది’’ అని ఆయన అన్నారు. కంపెనీ ఆఫర్‌ చేసిన జీతాలకు, అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు చెల్లిస్తున్న జీతాలకు పొంతనలేదని గుర్తించినట్లు విస్ట్రన్‌ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. దీనిపై యాజమాన్యానికి ఫిర్యాదులు కూడా అందాయని, చర్యలు ప్రారంభించేలోగానే గొడవ జరిగిందని ఆయన తెలిపారు.

 
“ఇలాంటి పరిణామాలు మంచిది కాదు. అయితే కార్మికులను కొందరు రెచ్చగొట్టారు. అందుకే దాడి జరిగింది. ఇప్పుడు అంతా సరిచేస్తున్నాం. త్వరలోనే ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తాం’’ అని ఆయన వెల్లడించారు.

 
రాజకీయాలే కారణమన్న బీజేపీ
విస్ట్రన్‌ కంపెనీ ఉద్యోగులను ఎస్‌.ఎఫ్‌.ఐ. నేతలు రెచ్చగొట్టారని కోలార్‌ ఎంపీ, బీజేపీ నేత ఎస్.మునిస్వామి చేసిన ఆరోపణతో వ్యవహరం రాజకీయం రంగు పులుముకుంది. “ఆరువేల ఎకరాలలో విస్తరించిన కంపెనీని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు కుట్ర చేశారు. దీనికి అన్ని ఆధారాలున్నాయి’’ అన్నారు మునిస్వామి.

 
“కార్మికుల సమస్యల గురించి మా దృష్టికి రాలేదు. అయితే కంపెనీ వేతనాలు, పని గంటల విషయంలో నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. వాటిని కార్మికులు అధికారుల దృష్టికి తీసుకురావాలి. సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ కంపెనీని ధ్వంసం చేసి కర్ణాటక పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకం కల్పిస్తే మాత్రం సహించేదిలేదు’’ అని మునిస్వామి స్పష్టం చేశారు. “ఎస్.ఎఫ్.ఐ. కార్యకర్తల కారణంగానే ఇదంతా జరిగింది. వారిపై చర్యలు తీసుకోవాలి’’ అన్నారాయన.

 
ఈ గొడవ తర్వాత ఎస్‌‌ఎఫ్‌‌ఐ నేత శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని, అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం తనపై విమర్శలు చేస్తోందని ఆయన బీబీసీతో అన్నారు. ఈ వ్యవహారంలో డిసెంబర్ 30 వరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని కోలార్‌ ఎస్పీ బీబీసీకి తెలిపారు. కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు ఆధారంగా రూ.437 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదైనట్లు ఆయన వెల్లడించారు. అయితే తమ కంపెనీ నష్టం రూ.50 కోట్ల లోపు ఉంటుందని తైవాన్‌ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 

 
ఇదొక హెచ్చరిక అంటున్న కార్మికులు
కోలార్‌ విస్ట్రన్ కంపెనీ ఘటన పారిశ్రామిక రంగానికి ఓ హెచ్చరికలాంటిదని బంగారుపేటకు చెందిన శ్రీనివాసన్ బాబు బీబీసీతో అన్నారు. “కంపెనీ ఒక్కో కార్మికుడికి రూ. 21 వేలు చెల్లిస్తున్నట్టు అధికారికంగా చెబుతోంది. కానీ ఏజన్సీలు మాత్రం రూ. 12 వేలు మాత్రమే ఇస్తామని చెప్పాయి. అందులోనూ కోతలు కోసి అరకొరగా చెల్లిస్తున్నాయి’’ అన్నారాయన.

 
“ఇలాంటి దోపిడిని ఎక్కువకాలం సహించలేరు అనడానికి ఈ ఘటన ఒక సంకేతం. కొందరు కార్మికులకు నెల వేతనం రూ.500 వేసిన సందర్భాలు కూడా ఉన్నట్లు తేలింది. ఆ డబ్బుతో కుటుంబాలను ఎలా పోషించాలి?’’ అని శ్రీనివాసన్‌ ప్రశ్నించారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే కార్మికశాఖ స్పందిస్తే ఇలాంటి పరిస్థితులు రావని శ్రీనివాసన్‌ అన్నారు. బెంగళూరు చుట్టూ ఉన్న అనేక పరిశ్రమల్లో ఇదే పరిస్థితి ఉందని, పర్యవేక్షణ లేపోవడంతో ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని శ్రీనివాసన్‌బాబు అన్నారు. ఇలాంటివాటిని తక్షణం సరిదిద్దాలని, కార్మికులు కూడా రెచ్చగొట్టేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.