మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 16 మే 2023 (20:10 IST)

ఐపీఎల్‌కు ‘ఎంఎస్ ధోనీ ట్రోఫీ’ అని పేరు మార్చే సమయం వచ్చిందా?

Dhoni
మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అయిన నాలుగేళ్ల తర్వాత, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోసం తిరుగులేని లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. 41 ఏళ్ల క్రికెట్ సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన రీఇన్వెన్షన్ గురించి స్పోర్ట్స్ జర్నలిస్ట్ సురేశ్ మేనన్ వివరించారు. ఈ సీజన్ ఐపీఎల్ ముగియగానే, ఐపీఎల్ ట్రోఫీకి ఒక కొత్త పేరు పెడితే ఎలా ఉంటుంది? ఇదేం చెత్త ఆలోచన కాదు.
 
ఈ సీజన్ ఐపీఎల్ అనగానే అభిమానులకు గుర్తొచ్చేది ఏంటని ఒకవేళ ఎవరైనా అడిగితే, దానికి సమాధానం ధోనీ అనే వస్తుంది. ధోనీ ఐపీఎల్ ముఖచిత్రంగా మారిపోయాడు. ఈ ఐపీఎల్‌కు ‘‘ఎంఎస్ ధోని ట్రోఫీ’’ అనే పేరు చక్కగా కుదిరిపోతుంది కూడా. 2008లో జరిగిన తొలి ఎడిషన్ ఐపీఎల్ టోర్నీలో ధోనీ అత్యంత ఖరీదైన ఆటగాడు. 15 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో అత్యంత విలువైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
 
కోట్లాది మంది ఆరాధించే సినీ తారలు, రాజకీయ నాయకుల నగరమైన చెన్నైలో కూడా ధోనీపై ప్రత్యేక అభిమానం కనిపిస్తుంది. ముఖ్యంగా ఐపీఎల్ జరిగే రోజుల్లో అక్కడ సినీతారలు, రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా ధోనీ నీరాజనాలు అందుకుంటాడు. సీఎస్కే ఫ్రాంచైజీకి, దాని అభిమానులకు మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ధోనీ ఇప్పటికీ సిక్స్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు. కెప్టెన్‌గా చాకచక్యంతో నిర్ణయాలు తీసుకుంటూ జట్టుకు గెలుపును అందిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటినుంచి ప్రతీ సంవత్సరం క్రికెట్ విమర్శకులు, అభిమానుల మనస్సులో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూనే ఉంది.
 
అదేంటంటే, ధోనీ ఈ ఏడాదితో అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటాడా? అనే ప్రశ్న ప్రతీ ఏడాది ఐపీఎల్ సందర్భంగా వినిపిస్తూనే ఉంటుంది. కానీ, ధోనీ మాత్రం వేరే ఆలోచనలో ఉన్నాడు. ధోనీ సారథ్యంలో సీఎస్కే ఇప్పటికి నాలుగు సార్లు టైటిల్‌ను అందుకుంది. ఈ ఏడాది మరోసారి జట్టును విజేతగా నిలిపి అయిదుసార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్ సరసన చేరుస్తాడని అభిమానుల్లో ఆశలు పెంచుతున్నాడు. ఐపీఎల్‌లో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
 
యువ క్రికెటర్లు, ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లు ధోనీ సారథ్యంలో ఆడి ఆటలో మెరుగుపడాలని ఆరాటపడుతుంటారు. ఈ జూలైలో ధోనీ 42 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. కెప్టెన్‌గా జట్టులో ఉండటానికి ధోనీ పూర్తిగా అర్హుడు. మైదానంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడని కాకుండా తన నుంచి స్ఫూర్తిని పొందుతున్న యువతరాన్ని నడిపించడానికి అతను కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు, అవసరమైన సమయంలో తమను తాము నిరూపించుకునేందుకు కష్టాలకు ఎదురునిలిచే జట్టు కావాలని తాను అడిగినట్లు ఒకసారి ధోనీ చెప్పాడు. సీఎస్కే రూపంలో అతనికి అలాంటి జట్టే లభించింది.
 
అయితే, ఈ సీజన్‌లో సీఎస్కే తరఫున 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలనేది ధోనీ తీసుకున్న నిర్ణయమే. ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. తనను క్రీజులో ఎక్కువగా పరిగెత్తించొద్దని సహచరులకు చెప్పినట్లు సమాచారం. ‘‘నన్ను ఎక్కువగా పరిగెత్తించొద్దు. నా పని ఏంటంటే, డెత్ ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగడం. మైదానం అవతలకు బంతుల్ని పంపించడం’’ అని ధోనీ సహచరులకు వివరించాడు. ఈ పనిని ధోనీ చాలా గొప్పగా చేస్తున్నాడు. ఐపీఎల్‌లో అతని స్ట్రయిక్ రేట్ 204గా ఉంది. ఈ సీజన్‌లో మొత్తం 47 బంతుల్ని ఎదుర్కొన్న ధోని 10 సిక్సర్లు బాదాడు. 96 పరుగులు చేశాడు. సగటున ప్రతీ 4.7 బంతులకు ధోని ఒక సిక్స్ కొట్టాడు.
 
8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ దిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్‌లో 9 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో సీఎస్కే 27 పరుగులతో గెలిచింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 4 బంతుల్లో 2 సిక్సర్ల సహాయంతో 13 పరుగులు చేశాడు. జట్టులో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చే ఒక బ్యాట్స్‌మన్ కోసం అభిమానులు ఇంతగా ఎదురుచూసిన సందర్భం నాకు ఒక్కటి కూడా గుర్తు లేదు.
 
ధోనీ సహచరుడు రవీంద్ర జడేజా మాట్లాడుతూ, ‘‘నాకు ఏడో స్థానంలో బ్యాటింగ్‌పై పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే, నేను ఏడో స్థానంలో వెళ్లేప్పుడు నా వికెట్ త్వరగా పడిపోవాలని కోరుకుంటూ జనాలంతా ధోని, ధోని అని అరుస్తారు. కేవలం చెన్నైలోనే కాదు మా జట్టు ఆడే ప్రతీ మైదానంలోనూ ఇదే జరుగుతుంది’’ అని అన్నాడు. ధోనీ తాజా ఆటతీరు రెండు రకాల ఆటగాళ్లకు ఒక సందేశాన్ని పంపుతుంది. అందులో ఒక రకం ప్లేయర్లు ఎవరంటే వన్‌డౌన్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చేవారు. వన్‌డౌన్ తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ నెమ్మదిగా ఆడుతూ బంతులు వృథా చేయకుండా సిక్సర్లు కొడుతూ ధాటిగా ఆడటం.
 
రెండో రకం ప్లేయర్లు ఎక్కవ వయస్సున్న బ్యాటర్లు. యువ క్రికెటర్లకు అత్యంత ప్రాధాన్యం లభించే టి20 క్రికెట్‌లో ఎక్కువ వయస్సున్న క్రికెటర్లు జట్టుకు ఉపయోగపడాలంటే బిగ్ హిట్టింగ్ చేయడం ఒక్కటే మార్గమని ధోని అంటున్నాడు. ఎరుపు బంతి క్రికెట్‌లో దీనికి భిన్నంగా ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ బౌండరీల కంటే ఎక్కువగా స్ట్రయిక్ రొటేట్ చేస్తారు. కానీ, తెలుపు బంతి క్రికెట్‌లో ఇలా ఆడితే తప్పు. ఈ రకం క్రికెట్‌లో 70 బంతుల్లో 50 పరుగులు చేయడం కంటే, 9 బంతుల్లో 20 బాదడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ధోని చెబుతున్నాడు.
 
41 ఏళ్ల వయస్సులో కూడా టి20 క్రికెట్ ఆడగలగడం అనేది పూర్తిగా ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. అలాగే ఆటపై అభిరుచి కూడా పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆటలో ఎంతో సాధించి, ఇంకా నిరూపించుకోవడానికి ఏమీ లేని ఆటగాడిని ఆటపై అభిరుచి మాత్రమే నడిపిస్తుంది. గతంలో భారీ సెంచరీలు, వేగవంతమైన అర్ధసెంచరీలు చేసిన ఒక క్రీడా దిగ్గజం, అలాంటి ఇన్నింగ్స్‌లను పునరావృతం చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. క్రీడల్లో ఇలాంటి పరిస్థితి చాలా దయనీయంగా అనిపిస్తుంది. ఇన్నేళ్లలో ధోనీ మనసులో ఏముందో ఎవరూ తెలుసుకోలేకపోయారు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు, అలాగే వన్డేల నుంచి తప్పుకున్నప్పుడు కూడా అతని అనూహ్య ప్రకటనలకు దేశమంతా ఆశ్చర్యపోయింది.
 
ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అవుతుందా? అనే ప్రశ్నకు అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు అనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఐపీఎల్ ట్రోఫీకి ధోనీ పేరు పెట్టడం సముచితంగా ఉంటుంది. ఎందుకంటే, అతని సారథ్యంలోని భారత జట్టు 2007లో వరల్డ్ కప్‌ను గెలుచుకున్న తర్వాతే ఐపీఎల్ పుట్టుకొచ్చింది. సచిన్ తెందూల్కర్, బిషన్ సింగ్ బేడీలపై పుస్తకాలను క్రీడా రచయిత సురేశ్ మీనన్ రాశారు.