బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 24 అక్టోబరు 2024 (14:11 IST)

ఐదేళ్ల తరువాత మోదీ,షీ జిన్‌పింగ్ సమావేశం, రష్యాలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే..

modi jinping
ఐదేళ్ల తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలోని కజాన్‌లో సమావేశమయ్యారు. కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్ -చైనాల మధ్య ఈ ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమస్యల గురించి చర్చించారు. ఇరువురు నేతలు 50 నిమిషాల పాటు మాట్లాడుకున్న ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు.
 
సమావేశం అనంతరం.. “కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ సమావేశం సందర్భంగా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిశాను” అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “భారత్-చైనా సంబంధాలు ఇరు దేశాల ప్రజలతో పాటు ప్రపంచ శాంతి, సుస్థిరత, పురోగతికి ఎంతో ముఖ్యం. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు మార్గనిర్దేశం చేసేలా ఉండాలి” అని మోదీ పేర్కొన్నారు. వీరిద్దరి సమావేశం తరువాత భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవాధీన రేఖ నుంచి ఇరు దేశాలు తమ సేనలను ఉపసంహరించుకోవడం, 2020లో మొదలైన వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకోవడాన్ని మోదీ, జిన్‌పింగ్ స్వాగతించారని తెలిపింది.
 
విదేశాంగ మంత్రి స్థాయిలో చర్చలు
ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలు, విభేదాలను సక్రమంగా పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతికి విఘాతం కలగకూడదని అన్నారు. భారత్- చైనా మధ్య సరిహద్దు సంబంధిత అంశాలపై ప్రత్యేక ప్రతినిధుల గురించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. సరిహద్దుల్లో శాంతిని పునరుద్ధరించడానికి, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి ఈ ప్రత్యేక ప్రతినిధులు త్వరలో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు విదేశాంగ మంత్రి స్థాయిలో చర్చలను ముందుకు తీసుకెళతామని చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటన తెలిపింది.
 
తమ దేశాల సుస్థిర, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలపై ఇరుదేశాల నేతలు దృష్టి సారించారని, తమ ప్రాంతంలో ప్రపంచ శాంతి, శ్రేయస్సు సానుకూల ప్రభావం గురించి కూడా ఇరు దేశాలు మాట్లాడుకున్నాయని ఆ ప్రకటన తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలను అన్ని రంగాల్లో మెరుగుపరుచుకోవాలని, అభివృద్ధి సంబంధిత సవాళ్లను పరిష్కరించుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారని ఆ ప్రకటనలో పేర్కొంది.
 
చైనా ఏం చెప్పింది?
జిన్‌పింగ్, మోదీ భేటీపై చైనా కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు, సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు విభేదాలను అవగాహనతో పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నొక్కిచెప్పాయని చైనా విదేశీ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో తెలిపింది. అభివృద్ధి విషయంలో ఒకరికొకరు సహకరించుకోవాలని ఇరువురు నేతలు సూచించారని, అంతర్జాతీయ బాధ్యతల్లో భుజం భుజం కలిపి నడవడం గురించి కూడా ఇరు దేశాలు మాట్లాడుకున్నాయని ఆ ప్రకటనలో తెలిపింది.