ముల్లంగి రసంలో నిమ్మరసం కలిపి..?

Last Updated: బుధవారం, 13 మార్చి 2019 (19:02 IST)
వాతావరణంలో మార్పుల కారణంగా కొన్ని సందర్భాలలో ముఖంపై మురికీ, జిడ్డు పేరుకుపోతుంటుంది. అలాంటి సమయంలో ఖరీదైన క్రీములు, పౌడర్లు వాడడం పరిష్కారం కాదు. ఆరంజ్ తొక్కలను బాగా ఎండబెట్టి, పొడిచేసుకోవాలి. ఒక స్పూన్ నారింజ పొడికి పెరుగును కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. 20 నిమిషాల తర్వాత వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖానికి మంచి కాంతి వస్తుంది.

ఇదేవిధంగా ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు, ముల్తానీ మట్టి కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖాన్ని తాజాగా మారుస్తుంది. చెంచా ఓట్స్‌లో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం తాజాగా మారుతుంది.

మురికి దూరమయ్యేలా, మొటిమలు రాకుండా ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పడుకునే ముందు గులాబీ నీళ్లూ, గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, మర్నాడు ఉదయాన్నే కడిగేస్తే ముఖం తాజాగా మారుతుంది. ఇంకా స్పూన్ ముల్లంగి రసంలో నాలుగు చుక్కల నిమ్మరసం వేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేసినా మంచిదే. ఇది బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేసి ముఖాన్ని శుభ్రపరుస్తుంది.

అలాగే నాలుగు బాదం గింజలను మిశ్రమంలా చేసి, దానికి స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. సెనగపిండిలో గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పట్టించి అరగంటయ్యాక కడిగేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.దీనిపై మరింత చదవండి :