మీగడలో పసుపు కలిపి పాదాలకు పట్టిస్తే...?
చలికాలంలో పాదాల సంరక్షణకు ఏం చేయాలంటే.. ప్రతిరోజూ పాదాలను చల్లని నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా చూసుకోవాలి. షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి.
అలానే చెప్పులు లేకుండా నడవకూడదు. ఉతకని సాక్స్ ఎక్కువ రోజుల పాటు వేసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పాదాలు పగుళ్లుగా ఉన్నప్పుడు బకెట్ నీటిలో కొద్దిగా వంటసోడా, ఉప్పు, నిమ్మరసం కలిపి ఆపై పాదాలు అందులో పెట్టి అరగంట పాటు అలానే ఉండాలి. తరువాత మెత్తని బట్టతో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేయడం వలన పాదాలు పగుళ్లు తొలగిపోయి మృదువుగా తయారవుతాయి.
నిమ్మ చెక్కలను ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. అందులో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి పాదాలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే పాదాలు కాంతివంతంగా మారుతాయి. కప్పు మీగడలో కొద్దిగా పసుపు, తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేయడం వలన పాదాలు తాజాగా మారుతాయి.