శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (20:41 IST)

కోవ్యాక్సిన్‌కు ''NO'' చెప్పిన బ్రెజిల్.. వివరణ ఇచ్చిన భారత్ బయోటెక్?!

కరోనా వ్యాక్సిన్‌ను వివిధ బయో కంపెనీలు తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఫైజర్, కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ వంటివి వున్నాయి. ఈ వ్యాక్సిన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే దిశగా ఆయా ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ బయోటెక్ తయారు చేసిన కొవ్యాక్సిన్ టీకాను దిగుమతి చేసుకోమంటూ బ్రెజిల్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 
 
టీకా ఉత్పత్తికి సంబంధించిన పారిశ్రామిక నిబంధనలు భారత్ బయోటెక్ పాటించలేదని బ్రెజిల్ ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది. కరోనా కారణంగా అల్లాడిపోతున్న బ్రెజిల్ గతంలో రెండు మిలియన్ల కొవ్యాక్సిన్ టీకా డోసులను దిగుమతి చేసుకునేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే..ఈ పరిణామంపై భారత్ బయోటెక్ కూడా స్పందించింది.
 
బ్రెజిల్ ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు అమలు చేస్తామని, ఎప్పట్లోగా ఈ పనిచేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. కొవ్యాక్సిన్ కరోనా టీకాను భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పూర్తైన క్లినికల్ ట్రయల్స్‌లో టీకా ప్రభావశీలత 81 శాతంగా ఉన్నట్టు తేలింది.