గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (22:08 IST)

కేసులు మాత్రమే తగ్గుతున్నాయి.. కరోనా తీవ్రత కాదు.. లాక్డౌన్ తప్పదేమో?

గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజూ కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. అలాగే ఈ వైరస్ బారినపడి చనిపోయే వారి సంఖ్య కూడా తక్కువగా ఉంది. ఈ క్రమంలో సీసీఎంబీ సీఈవో మధుసూదన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రస్తుతం మన దేశంలో రోజూ నమోదయ్యే కరోనా పాజటివ్ కేసులు మాత్రమే తగ్గుతున్నాయని, మహమ్మారి తీవ్రత తగ్గిందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమన్నారు. అదేసమయంలో ప్రతి ఒక్కరూ మాస్కును కచ్చితంగా ధరించాలని సూచించారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే మరోసారి లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
 
అదేసమయంలో కరోనా వ్యాక్సిన్ రావడానికి మరో యేడాది సమయం పట్టొచ్చన్న ఆయన.. త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యలతో విభేదించారు. మరోవైపు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ టీకా లండన్, బ్రెజిల్‌లో వికటించి ఓ వలంటీర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీంతో ఈ టీకా పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పతాక స్థాయికి చేరుకున్న తర్వాత, ఇటీవల ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16 కరోనా మరణాలు సంభవించాయి. 
 
దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,524కి పెరిగింది. తాజాగా 76,726 నమూనాలు పరీక్షించగా 3,620 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 631, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 66 కేసులు గుర్తించారు. 
 
అదేసమయంలో రాష్ట్రంలో 3,723 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 7,96,919 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,58,138 మంది వైరస్ నుంచి విముక్తులయ్యారు. ఇంకా, 32,257 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రస్తుతం జిల్లాల వారీగా యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే, 
 
అనంతపురం 1777, చిత్తూరు 3746, ఈస్ట్ గోదావరి 5935, గుంటూరు 3704, కడప 2042, కృష్ణ 3096, కర్నూలు 748, నెల్లూరు 575, ప్రకాశం 2785, శ్రీకాకుళం 1200, విశాఖపట్టణం 2172, విజయనగరం 852, వెస్ట్ గోదావరి 3625 చొప్పున ఉన్నాయి.