షుగర్ మందులోనే కోవిడ్‌కు మందు ఉందా?
కరోనా వ్యాధి అంత తేలికగా ప్రపంచాన్ని వదలదని శాస్త్రవేత్తలు ఎపుడో చెప్పారు. ఇది ఒక సాధారణ జలుబులా మారిపోతుందని, కోవిడ్‌కు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే పరిస్థితులు ముందు ముందు ఏర్పడతాయని విశ్లేషిస్తున్నారు.
దీనికి అణుగుణంగానే, కొవిడ్ ఔషధ పరిశోధనలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అంకుర సంస్థ కీలక విషయాన్ని గుర్తించింది. మధుమేహ నియంత్రణకు వాడే ఎర్టుగ్లిఫ్లోజిన్ ఔషధం కరోనాను అడ్డుకుంటుందని ఒక అధ్యయనంలో తేలింది.
కేంద్రీయ వర్సిటీలోని రీజీన్ ఇన్నోవేషన్స్ అంకుర సంస్థ, ఇంద్రాస్, టెక్‌మహేంద్ర తోడ్పాటుతో కొవిడ్ ఔషధ ప్రయోగాలను చేపట్టింది. వీరి పరిశోధనలో ఎర్టుగ్లిఫ్లోజిన్ ఔషధం... కొవిడ్-19 స్పైక్ ప్రొటీన్ మానవ ఏసీఈ2 రిసెప్టర్‌తో బంధించకుండా... వైరస్‌ని సమర్థంగా అడ్డుకోవడం గుర్తించారు. కొవిడ్ బారిన పడితే ప్రాథమికంగా కన్పించే లక్షణాలైన శరీర కణజాలాల్లో వాపు, రక్తం గడ్డకట్టే సామర్థ్యం గణనీయంగా తగ్గడం తదితరాలను త్రీడీ మానవ వాస్కులర్ ఊపిరితిత్తుల నమూనాలో పరిశోధకులు గుర్తించారు.
ఈ పరిశోధనలు పూర్తిగా ఫలిస్తే, ఇక కోవిడ్‌కు రెడీ టు యూజ్ మందు అతి తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినట్లే అని రీజీన్ ఇన్నొవేషన్స్ సి.ఇ.ఓ ఉదయ్ సక్సేనే అంటున్నారు. ఈ పరిశోధనల్లో డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగల, డాక్టర్ శ్రీధర్ ఓలేటి కూడా భగం పంచుకుంటున్నారు.
పరిశోధన ఫలితాలను బయో ఆర్ఎక్స్ఎల్ -4 జర్నల్‌లో పబ్లిష్ చేశారు. అలాగే దీనికి పేటెంట్ కూడా అడుగుతున్నారు. దీనికి జాయింట్ పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని మేకర్స్ ల్యాబ్ గ్లోబల్ హెడ్ మల్హోత్ర చెప్పారు. ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని, దీనిని జంతువలపై పరీక్షించిన తర్వాత, ఇంకా మానవ ప్రయోగాలు కూడా చేయాల్సి ఉందన్నారు.