సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మార్చి 2020 (17:53 IST)

ఐపీఎల్‌-2020లో రాణిస్తేనే ధోనీకి జట్టులో స్థానమా?

భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన క్రికెట్ హీరో మహేంద్ర సింగ్ ధోనీ. దేశానికి రెండు ప్రపంచ కప్‌లు అందించిన ఘనత ఆయనకే సొంతం. అలాంటి ధోనీ క్రికెట్ భవితవ్యం ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. జట్టులో చోటు కోల్పోయిన ధోనీ.. త్వరలో స్వదేశంలో జరుగనున్న ఐపీఎల్2020 టోర్నీలో రాణిస్తేనే తిరిగి పునరాగమం చేసే అవకాశాలు ఉన్నాయంటూ పలువురు మాజీ క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యలు ఇపుడు సగటు క్రీడాభిమానిని నివ్వెరపరుస్తున్నాయి. 
 
ఈ నెల 29వ తేదీ నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుంది. అయితే, ఈ టోర్నీ నిర్వహణపైనే ఇపుడు నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా వైరస్ పుణ్యమాని తమ రాష్ట్రంలో ఈ పోటీలను నిర్వహించరాదంటూ కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీ జరుగుతుందా లేదా అన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. 
 
ఒకవేళ ముందుగా ప్రకటించినట్టుగా ఐపీఎల్ ప్రారంభమైతే చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ధోని ఆస్థాన కెప్టెన్‌. ఈ సీజన్‌లో ధోని బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తే.. జట్టులోకి పునరాగమం చేయగలడని ఇటీవల కోచ్‌ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. ఇపుడు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ సునీల్‌ జోషి సైతం.. ఐపీఎల్‌లో ధోని రాణిస్తే, జట్టులో స్థానం దక్కుతుందని తెలిపారు. 
 
అతనే కాదు, ఐపీఎల్‌ చాలా మంది సీనియర్‌ ఆటగాళ్లు, యువ ఆటగాళ్లు సైతం తమ భవిష్యత్‌ను పరీక్షించుకోనున్నారని తెలిపాడు. ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ మధ్య వాంఖేడే స్టేడియంలో ఈ నెల 29న జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనే ధోనీ బ్యాట్‌తో రాణించేందుకు ప్రస్తుతం ముమ్మరంగా సాధన చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ధోని మైదానంలో అడుగుపెట్టక చాలా రోజులవుతోంది. 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టుతో ఓటమి అనంతరం, ధోని భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతనికి బదులుగా జట్టుకు వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌, కే.ఎల్‌.రాహుల్‌ బాధ్యతలు నిర్వర్తించారు. వీరిలో రాహుల్‌.. గత కివీస్‌ టూర్‌లో బ్యాట్స్‌మెన్‌గా, కీపర్‌గా అద్భుతంగా రాణించాడు. 
 
కాగా, భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్‌గా నూతనంగా నియమితులైన సునీల్‌ జోషి.. అతని టీం గత ఆదివారం, దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు జట్టును ప్రకటించారు. ఈ జట్టులో రిషభ్‌ పంత్‌, రాహుల్‌ తమ స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ధోనీకి మాత్రం ఈ జట్టులో స్థానం లభించలేదు. ఈ సమయంలో, మీడియా ధోని గురించి అడగగా వారు.. ప్రస్తుతం జట్టులో వికెట్‌ కీపర్‌గా పంత్‌ ఉన్నాడని తెలిపారు. రాహుల్‌ కూడా కీపర్‌గా అద్భుతంగా రాణించగలడని వారు ధీమా వ్యక్తం చేశారు. అంటే ధోనీకి జట్టులో స్థానంపైనగానీ, ధోనీ భవితవ్యంపైనగానీ ఆయన సూటిగా సమాధానమివ్వలేదు.