ఆదివారం, 15 ఫిబ్రవరి 2026
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 ఫిబ్రవరి 2026 (08:23 IST)

నేడు క్రికెట్ ప్రపంచాన్ని స్తంభింపజేసే మ్యాచ్ - భారత్ వర్సెస్ పాకిస్థాన్

indiavapakistan
క్రికెట్ ప్రపంచం స్తంభింపజేసే మ్యాచ్ నేడు జరుగనుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలోభాగంగా, కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. గత యేడాది పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాక రెండు జట్లూ తొలిసారి ప్రపంచ కప్‌లో తలపడనున్నాయి. 
 
సాధారణంగా ఐసీసీ టోర్నీల్లో రెచ్చిపోయి ఆడే భారత జట్టు.. ఘనమైన రికార్డును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అలాగే, ఇటీవలి ఫామ్‌ను కొనసాగిస్తూ, కసితో ఆడి భారత్‌ను దెబ్బకొట్టాలని పాకిస్థాన్ జట్టు చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగడం అభిమానుల్లో భావేద్వేగాలు పతాక స్థాయికి చేరుకోవడం ఖాయంగా తెలుస్తోంది. 
 
అయితే, ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అన్నది వరుణుడి కరుణ మీద ఆధారపడివుంటుంది. ఈ మ్యాచ్‌కు వేదికైన కొలంబోలో ఆదివారం వర్షంపడే సూచనలు 70 ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అదేసమయంలో మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. ప్రపంచ కప్‌లో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రమే రిజర్వు డే ఉంది. సో, మ్యాచ్ రద్దు అయితే మాత్రం మళ్లీ తలపడే అవకాశం లేదు. 
 
ఈ మ్యాచ్‌పై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన అఘా స్పందిస్తూ, కొలంబో మాకిపుడు సొంత మైదానం. ఈ మ్యాచ్‌లను ఇక్కడే ఆడుతున్నాం. కాబట్టి ప్రతి ణ్యాచ్ గెలిస్తామని కాదు. ఇది సానుకూలతా అంటే చెప్పలేను. వేదిక ఏదైనా మెరుగైన క్రికెట్ ఆడటం, ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడం కీలకం. 
 
అలాగే, భారత కెప్టెన్ సూర్యకుమార్ స్పందిస్తూ, భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అదొక గొప్ప సందర్భం. ప్రతిభను చాటడానికి అతిపెద్ద వేదిక. ఇది కూడా మిగిలిన మ్యాచ్‌ల్లాగే అని చెప్పొచ్చు. కానీ, దీని ప్రాధాన్యమేంటో ఆడేవాళ్లకే తెలుసు. ఎందుకంటే పాకిస్థాన్‌తో తరచూ తలపడం అని అన్నారు. 
 
తుది జట్ల అంచనా... 
భారత్ : అభిషేక్ లేదా సంజు, ఇషాన్, తిలక్, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్ దూబె, రింకు, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా.
 
పాకిస్థాన్ జట్టు : ఫర్హాన్, అయూబ్, ఆఘా (కెప్టెన్), బాబర్, షాదాబ్, ఉస్మాన్, ఫహీమ్, నవాజ్ లేదా సల్మాన్ మీర్జా, షహీన్, అబ్రార్, తారిఖ్.