సోమవారం, 2 మార్చి 2026
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 మార్చి 2026 (23:07 IST)

సంజు శాంసన్ ఒంటరి పోరాటం - వెస్టిండీస్‌పై భారత్ ప్రతీకారం... దర్జాగా సెమీస్‌కు

teamindia
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా వెస్టిండీస్ జట్టుపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. గత ఐసీసీ ఈవెంట్‌లో భారత్‌ను కరేబియన్లు ఓడించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కోల్‌కతా వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో విండీస్ జట్టును భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడించి, పొట్టి క్రికెట్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో క్షణం ఆలస్యం చేయకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌‍లో ఓపెనర్లు హోప్ 32, రోస్టన్ చేజ్ 40, షిమ్రాన్ హిట్మెర్ 27, రూథర్‌ఫర్డ్ 14, పావెల్ 34, హోల్డర్ 37 చొప్పున పరుగులు చేయగా, అదనంగా మరో 11 పరుగులు వచ్చాయి. ముఖ్యంగా, హిట్మెయిర్ 12 బంతుల్లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ సాయంతో 27 పరుగులు శాడు. 
 
అలాగే, పావెల్ 19 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు, హోల్డర్ 22 బంతుల్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 37 పరుగులు చేశారు. మ్యాచ్ చివరల్లో హోల్డర్, పావెల్‌లు బ్యాట్ ఝుళిపించడంతో వెస్టిండీస్ జట్టు స్కోరు 195 మార్క్‌‍కు చేరుకుంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు 2, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యాకు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. దీంతో భారత్ ముంగిట 196 పరుగుల విజయలక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ఉంచుంది. 
 
ఆ తర్వాత 196 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో నాలుగు బంతులు మిగిలివుండగానే ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు అభిషేక్ శర్మ 10, సంజూ శాంసన్ 97 (నాటౌట్), ఇషాన్ కిషన్ 10, సూర్యకుమార్ యాదవ్ 18, తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 17, శివమ్ దూబెలు 8 చొప్పున  పరుగులు చేయగా, అదనంగా మరో 12 పరుగులు వచ్చాయి. 
 
ఈ మ్యాచ్‌ను సంజూ శాంసన్ వీరోచిత పోరాటం చేసి ఒంటి చేత్తో గెలిపించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ.. మ్యాచ్ ముగిసేంత వరకు క్రీజ్‌లో నిలబడ్డాడు. మొత్తం 50 బంతులను ఎదుర్కొన్న సంజూ... నాలుగు సిక్స్‌లు, 12 ఫోర్ల సాయంతో 97 పరుగులు చేసి సెంచరీకి మరో మూడు పరుగుల దూరంలో వచ్చి ఆగిపోయాడు. అయితే, జట్టును మాత్రం గెలిపించి, సెమీస్‌కు చేర్చాడు. భారత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.