శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (15:55 IST)

చరిత్ర సృష్టించిన రోహిత్‌ .. వన్డేల్లో "ఒకే ఒక్కడు"

భారత క్రికెట్ జట్టు స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఏకంగా మూడో డబుల్ సెంచరీ కొట్టిన ఏకైక ఆటగాడిగా తన పేరును లఖించుకున్నాడు.

భారత క్రికెట్ జట్టు స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఏకంగా మూడో డబుల్ సెంచరీ కొట్టిన ఏకైక ఆటగాడిగా తన పేరును లఖించుకున్నాడు. ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో చిత్తుగా ఓడిన కసో ఏమోగానీ.. బుధవారం మొహాలీ వేదికగా జరిగిన రెండో వన్డేలో శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశాడు. ఆ బౌలర్ ఈ బౌలర్ అన్న తేడా లేదు.. అందరినీ చితక బాదాడు. కేవలం 151 బంతుల్లోనే 13 ఫోర్లు, 12 సిక్సర్లతో వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేశాడు. చివరికి 153 బంతుల్లో 208 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
 
గతంలోనే రోహిత్‌శర్మ రెండుసార్లు డబుల్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. ఇదే శ్రీలంకపై గతంలో రోహిత్ 264 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరుగా ఉంది. తొలుత 2013 నవంబరు 2వ తేదీన ఆస్ట్రేలియాతో బెంగుళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 209  (16 సిక్స్‌లు, 12 ఫోర్లు) పరుగులు చేశాడు. ఆ తర్వాత 2014 నవంబరు 13వ తేదీన కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 (9 సిక్స్‌లు, 33 ఫోర్లు) పరుగులు చేశాడు. ఇపుడు అదే శ్రీలంక జట్టుపై 208 (నాటౌట్) రన్స్ చేశాడు. 
 
కాగా, బుధవారం జరిగిన మ్యాచ్‌లో సెంచ‌రీని 115 బంతుల్లో సాధించిన రోహిత్‌.. త‌ర్వాత చెల‌రేగిపోయాడు. త‌ర్వాతి సెంచ‌రీని కేవ‌లం 36 బంతుల్లోనే కొట్ట‌డం విశేషం. సెంచ‌రీ త‌ర్వాతే అత‌ను ప‌ది సిక్స‌ర్లు బాదాడంటే రోహిత్ ఊచ‌కోత ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ స్కోరులో 13 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. 
 
కాగా, రోహిత్ శర్మ డబుల్ సెంచరీ కొట్టడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.