1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మే 2024 (11:30 IST)

ఐపీఎల్ 2024 : మరోమారు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కల చెదిరింది...

Royal Challengers Bangalore
ఐపీఎల్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కల చెదిరిపోయింది. ఈ దఫా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలాన్న ఆశ నెరవేరకుండానే ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. సంచలన రీతిలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆ జట్టు ప్రస్థానం బుధవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసి ఆర్సీబీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. 
 
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (34), విరాట్ కోహ్లి (33), లామ్రోర్ (32) కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. మిగతా బ్యాటర్లలో డుప్లెసిస్ (17), మ్యాక్స్వెల్ (0), దినేశ్ కార్తీక్ (11), స్వప్నిల్ సింగ్ (9 నాటౌట్), కర్జ్ శర్మ (5) చొప్పున పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 వికెట్లు, అశ్విన్-2, బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్ తలో వికెట్ తీశారు.
 
ఆ తర్వాత 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ జట్టు ఇన్నింగ్స్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లు అందరూ సమష్టిగా రాణించారు. 45 పరుగులు సాధించిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్‌‌గా ఉన్నాడు. మిగతా బ్యాటర్లలో టామ్ కోహ్లెర్ (20), సంజూ శాంసన్ (17), రియాన్ పరాగ్ (36), ధ్రువ్ జురెల్ (8), హెట్మేయర్ (26), పావెల్ (16 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (0 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. 
 
బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆ జట్టు ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. దీంతో ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించలేకపోయారు. ఒక దశలో రాజస్థాన్ కీలకమైన వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ మలుపు తిరుగుతుందేమో అనిపించింది. కానీ అలా జరగలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించిన రాజస్థాన్ విజేతగా నిలిచింది. ఇక బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్‌కు 2 వికెట్లు పడ్డాయి. లూకీ ఫెర్గూసన్, కర్జ్ శర్మ, కెమెరాన్ గ్రీన్ తలో వికెట్ తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది.
 
కాగా క్వాలిఫయర్-2 అర్హత సాధించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు గురువారం చెన్నై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు ఫైనల్‌లో కోల్‌‍కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది.