సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By బీబీసీ
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (17:52 IST)

India vs England: బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు

భారత క్రికెట్ జట్టుతో తలపడే విదేశీ జట్లకు ఒకప్పుడు ''స్పిన్'' మాత్రమే ముప్పుగా ఉండేది. కానీ నేటి పరిస్థితి అలాకాదు. గత నాలుగేళ్లలో భారత జట్టు ఆడిన టెస్టు క్రికెట్ మ్యాచ్‌లలో దాదాపు 60 శాతం వికెట్లను ఫాస్ట్ బౌలర్లే తీశారు. గత 75ఏళ్ల చరిత్రతో పోలిస్తే.. ఇది దాదాపు 20 శాతం కంటే ఎక్కువే.
 
ఈ విషయంలో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలకే క్రెడిట్ దక్కుతుంది. వీరితో పొంచివున్న ముప్పు ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు బాగా తెలుసు. చెన్నైలో శుక్రవారం నుంచి ఈ రెండు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ మొదలుకాబోతోంది.
 
భారత పేసర్లు నలుగురిలో ఒకరు దాదాపుగా పోలీసు కాబోయారు. మరొకరికి శిక్షణ కంటే నిద్ర పోవడమే ఎక్కువ ఇష్టం. భారత క్రికెట్ చరిత్రలోనూ మునుపెన్నడూ లేని రీతిలో ఫాస్ట్ బౌలింగ్‌తో దూసుకువెళ్తున్న క్రికెటర్లతో ఆడినవారిని, వారికి మార్గ నిర్దేశం చేసిన వారిని బీబీసీ స్పోర్ట్స్ ఇంటర్వ్యూ చేసింది.
 
ఫ్రెండ్లీ సూపర్‌స్టార్ - జస్‌ప్రీత్ బుమ్రా 
మెరుపు వేగంతో చెలరేగే భారత బౌలర్లలో బుమ్రా నిస్సందేహంగా సూపర్‌స్టారే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన 27ఏళ్ల బుమ్రా తన సత్తా చాటాడు. ఆ తర్వాత టెస్టు కెరియర్‌లోనూ మెరుపులు మెరిపించాడు.
 
''బుమ్రా అంటే విరాట్‌కు చాలా ఇష్టం''అని భారత జట్టు మాజీ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా చెప్పారు. ప్రస్తుతమున్న నలుగురు ఫాస్ట్ బౌలర్లతోనూ ఆయన కలిసి ఆడారు. ''ఎప్పుడైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే.. వెంటనే బాల్‌ను బుమ్రాకు ఇవ్వాలని విరాట్ భావిస్తాడు''.
 
''టెస్ట్ మ్యాచ్‌లకు బుమ్రా పెట్టింది పేరు. చాలా వేగంతో విరుచుకుపడతాడు''. తక్కువ దూరం నుంచే పరిగెత్తుకుంటూ వచ్చి వేగంగా బాల్ వేయడం చిన్నప్పటి నుంచే బుమ్రాకు అలవాటు. తన ఇంటి వెనుక ప్రాంతంలో ఇలానే అతడు బౌలింగ్ చేసేవాడు. వేగంగా చేతులు తిప్పుతూ గంటకు 90 కి.మీ. వేగంతో బుమ్రా బాల్ వేయగలడు.
 
''ఎవరు తను? ఇలా బౌలింగ్ చేస్తున్నాడు ఏమిటి? ముంబయి ఇండియన్స్ ఇతణ్ని ఎందుకు తీసుకుంది?''అని మొదట్లో తను అనుకునే వాణ్నని అభిషేక్ ఝుంఝువాలా చెప్పారు. కెరియర్ ప్రారంభంలో అభిషేక్‌తో కలిసి బుమ్రా ఆడాడు. ఎప్పుడూ ఆగ్రహావేశాలతో కనిపించే ఫాస్ట్‌బౌలర్ కాదు బుమ్రా. అతడి మొహంలో ఎప్పుడూ చిరు నవ్వు కనిపిస్తుంది. అతడికి పాటలు వినడమంటే చాలా ఇష్టం.
 
''నేను కలిసి ఆడిన అత్యుత్తమ క్రికెటర్లలో బుమ్రా కూడా ఒకరు. ఇతర ఫాస్ట్‌బౌలర్లలా అతడు అంత హడావిడి చేయడు. చాలా ప్రశాంతంగా ఉంటాడు''అని రైనా చెప్పారు.
 
నిద్ర అంటే చాలా ఇష్టం - షమీ 
గత నాలుగేళ్లలో భారత్‌కు ఎక్కువ వికెట్లు తీసిపెట్టింది షమీనే. 30ఏళ్ల షమీకి పిచ్, బాల్‌పై మంచి పట్టు ఉంటుంది. ఇదే ఆయన్ను కీలక ప్లేయర్‌గా నిలబెట్టింది. అయితే, ఆయన గురించి ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి.
 
''నిద్ర, ఆహారం అంటే అతడికి చాలా ఇష్టం''అని అభిషేక్ చెప్పారు. బెంగాల్‌లో వీరిద్దరూ కలిసే ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేటప్పుడు వీరు ఒకే గదిలో ఉండేవారు.
 
''క్రికెట్ తర్వాత ఖాళీ సమయాల్లో బెంగాలీ ప్లేయర్స్ ఏదో ఒకటి చేస్తుంటారు. అయితే షమీ వారితో వచ్చే వాడు కాదు. రోజంతా మంచానికే అతుక్కుపోయేవాడు. ఒక వేళ క్రికెట్ లేకపోతే అతడు 24 గంటల్లో 18 గంటలు పడుకుంటాడు''అని అభిషేక్ వివరించారు.
 
''అతడికి మంచి సామర్థ్యముందని అందరికీ తెలుసు. అయితే అతడి ఫిట్‌నెస్ గురించి మేం చాలా చెప్పే వాళ్లం. నువ్వు కొంచెం దీనిపై దృష్టి పెడితే భారత జట్టులో చోటు సంపాదిస్తావని అనే వాళ్లం''అని అభిషేక్ చెప్పారు.
 
2012-13లో దేశీయ క్రికెట్‌లో షమీ ఆడారు. ఆ తర్వాత జనవరి 2013లో భారత్ తరఫున ఆడేందుకు ఆయనకు అవకాశం లభించింది. అదే ఏడాది తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్ కూడా ఆడారు. ''ఆ సమయంలోనే సరదా కోసం ఆడటంలేదని, దేశం కోసం ఆడుతున్నాడని తను గ్రహించాడు''అని అభిషేక్ వివరించారు.
 
''తను చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతడిలో ఎలాంటి కోపం లేదా ఆవేశం కనిపించదు. డ్రెస్సింగ్ రూమ్‌లోనూ తను హడావిడి చేయడు. అన్ని పనులు ప్రశాంతంగా చేసుకొని పోతాడు''. ఇంగ్లండ్‌తో ఆడే తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో షమీ, ఉమేశ్‌లు కనిపించకపోవచ్చు. వారు గాయాలపాలు కావడమే దీనికి కారణం.
 
తృటిలో తప్పిపోయింది - ఉమేశ్ యాదవ్ 
ఇటీవల కాలంలో బుమ్రా, షమీ లేదా ఇషాంత్ గాయాల పాలైనప్పుడు 33ఏళ్ల ఉమేశ్‌ ప్రత్యామ్నాయంగా మారాడు. మంచి ఫిట్‌నెస్‌తో ఆడే ఉమేశ్.. ఒకవైపు ఫాస్ట్ బౌలర్. మరోవైపు మంచి బ్యాట్స్‌మన్. పాఠశాల విద్య పూర్తైన తర్వాత పోలీసు విభాగంలో చేరేందుకు ఉమేశ్ దరఖాస్తు చేసుకున్నారు. ఎంపిక ప్రక్రియలో ఇంకొక రెండు పాయింట్లు వచ్చుంటే అతడి జీవితం వేరేలా ఉండేది.
 
నాగ్‌పుర్‌లో సెకండ్ డివిజన్ క్లబ్ క్రికెట్‌లో ఆడేటప్పుడు ఉమేశ్‌ను ఒక అంపైర్ గుర్తించారు. ఆ అంపైర్ స్థానిక ఫస్ట్ క్లాస్ టీమ్ కెప్టెన్ ప్రీతమ్ గాంధేకు సోదరుడు. వీరు తమతో కలిసి ఆడేందుకు ఉమేశ్‌ను ఆహ్వానించారు. ''బౌలింగ్ వేయడానికి కాస్త వెనక్కి వెళ్లి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. అతడిలో ఏదో తెలియని మాయాజాలం ఉందని అనిపించేది''అని గాంధే చెప్పారు.
 
''మొదట్లో జనాలు అతడిపై అంత ఆసక్తి చూపేవారు కాదు. అతడు చిన్నవాడని, సరిగ్గా బౌలింగ్ చేయడంలేదని అనేవారు''అని గాంధే వివరించారు. ''కానీ నాకు బాగా తెలుసు. ఏలాగైనా అతడితో కలిసి పనిచేయాలని అనుకున్నాను. ఓవర్‌కు మూడు బాల్స్ వేసినా.. అవతలి జట్టును అతడు మట్టికరిపించగలడు''.
 
21ఏళ్ల వయసులో విదర్భ తరఫున ఉమేశ్ రంజీ ట్రోఫీ ఆడాడు. ''అతడు వేసిన బాల్ ఓ బ్యాట్స్‌మన్ హెల్మెట్‌కు తగిలింది. దీంతో హెల్మెట్ బీటలు వారింది. ఇంకొకరికి బాల్ చెస్ట్ గార్డ్‌పై తగిలింది. అది కూడా బీటలు వారింది''అని గాంధే చెప్పారు. ''ఏదో వెస్ట్ ఇండీస్ బౌలర్‌తో ఆడుతున్నట్లు అనిపిస్తోందని మధ్యప్రదేశ్ తరఫున ఆడిన రిషీకేశ్ కణిత్కార్ నాతో అన్నారు''.
 
మంచి అనుభవంతో..- ఇషాంత్ శర్మ 
క్రికెట్‌లో ఇషాంత్ శర్మకు మంచి అనుభవముంది. భారత్ తరఫున అతడు 97 టెస్టులు ఆడాడు. బాల్‌ను భిన్నంగా బౌన్స్ చేయించడంలో ఇషాంత్ పెట్టింది పేరు. ప్యాడ్స్‌ను లక్ష్యంగా చేసుకొని మెరుపు వేగంతో అతడు బౌలింగ్ చేస్తుంటాడు.
 
అండర్-19 ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ బ్రౌన్ జట్టుతో ఇషాంత్ తలపడేవారు. అయితే కౌంటీ క్రికెట్‌లో 2018లో ససెక్స్‌ తరఫున వీరిద్దరూ కలిసి ఆడారు. ''ఆ రోజుల్ని మేం తరచూ గుర్తుచేసుకునే వాళ్లం. మా జట్టు (ఇంగ్లండ్) కొట్టిన స్కోర్‌ను కోహ్లీ గంటన్నరలో కొట్టేసేవాడు''అని బ్రౌన్ చెప్పారు.
 
''ఇషాంత్ చాలా సరదాగా ఉంటారు. అతడికి హాస్యం కాస్త ఎక్కువే ఉంటుంది''. ''మేం కలిసి వాగమామా రెస్టారెంట్‌కు వెళ్లాం. ఫైర్‌క్రాకర్ ఇక్కడ అన్నింటికంటే బావుంటుందని ఇషాంత్ చెప్పాడు. అయితే అది చాలా కారంగా ఉంటుంది... మీరు తినలేరు.. ఆర్డర్ చేయొద్దని ఇషాంత్ చెప్పాడు''
 
''కానీ ఇషాంత్ ఆర్డర్ చేసుకున్నాడు. ఆ కారాన్ని తట్టుకోలేక అష్టకష్టాలు పడ్డాడు''. 32ఏళ్ల ఇషాంత్ అంత కారాన్ని తట్టుకోలేకపోవచ్చు కానీ... గ్రౌండ్‌లో మాత్రం చెలరేగుతాడు. ''గ్రౌండ్ వెలుపల అతడు చాలా సరదాగా ఉంటాడు. కానీ గ్రౌండ్‌లోకి అడుగుపెడితే.. అతడిలో క్రీడా స్ఫూర్తి కనిపిస్తుంది''అని బ్రౌన్ అన్నారు.
 
భారత్ తరఫున వంద టెస్టులు ఆడిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా ఇషాంత్ నిలవబోతున్నాడు. భారత్ జట్టులో పేసర్లను చూస్తుంటే.. ఈ రికార్డును మరికొంత మంది సాధించేలా కనిపిస్తున్నారు.