సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (17:54 IST)

వరల్డ్‌కప్ పోటీల్లో సచిన్‌ని మించే మొనగాడు ఇంకా పుట్టలేదా..?

ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు గాడ్ ఆఫ్ క్రికెట్‌గా కీర్తించే సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పి చాలా కాలం అయింది. అయినప్పటికీ అతను వేసిన బాటలో ఎంతో మంది క్రికెటర్లు ముందుకు వస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నప్పటికీ సచిన్ ఎప్పటికీ ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాడు. 
 
అందులో ప్రపంచకప్‌లో అతను సాధించిన రికార్డులను ప్రస్తుత క్రికెటర్లు అందుకోవడం అసాధ్యం అని చెప్పాల్సిందే. సచిన్ మొత్తంగా 6 ప్రపంచకప్ పోటీలలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించి 45 మ్యాచ్‌లు ఆడాడు. 44 ఇన్నింగ్స్‌లలో 2278 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు 15 హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. బ్యాటింగ్ సగటు 56.95గా నమోదు చేశాడు. అంతే కాకుండా కీలక మ్యాచ్‌లలో బంతితో కూడా జట్టును అనేక సార్లు గెలిపించాడు. 
 
సచిన్ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్, శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆ జాబితాలో ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ తప్ప మరెవరూ లేరు. అతనికి కూడా ఇదే చివరి వరల్డ్‌కప్ కావచ్చు. ఇప్పటికే 39 సంవత్సరాల ఈ కరీబియన్ ఆటగాడు ప్రపంచకప్‌లో 944 పరుగులు సాధించాడు. 
 
అయితే బాగా రాణిస్తే సచిన్ రికార్డ్‌కి చేరువ కాగలడేమో గానీ ఆ రికార్డ్‌ను మాత్రం అందుకోలేడు. ఎంత మంది ఆటగాళ్లు వచ్చినా సచిన్ ప్రపంచకప్ రికార్డ్‌లు పదిలంగానే ఉంటాయని సచిన్ అభిమానులు గర్వంగా చెబుతున్నారు.