1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (10:26 IST)

అట్టహాసంగా ఫిఫా ప్రపంచకప్ ప్రారంభం.. అడుగడుగునా భద్రత

ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఫిఫా ప్రపంచకప్ మాస్కోలోని లుజ్నికీ స్టేడియంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. జూలై 15వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో 32 జట్లు టైటిల్ వేట కోసం బరిలోకి దిగుతున్నాయి

ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఫిఫా ప్రపంచకప్ మాస్కోలోని లుజ్నికీ స్టేడియంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. జూలై 15వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో 32 జట్లు టైటిల్ వేట కోసం బరిలోకి దిగుతున్నాయి. రష్యా, సౌదీ అరేబియా జట్ల మధ్య మొదటి మ్యాచ్ మొదలుకావడానికి ముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. 
 
వరల్డ్ కప్ ట్రోఫీని మాంచెస్టర్ యునైటెడ్‌కు ఒకప్పుడు ప్రాతినిథ్యం వహించిన స్పెయిన్ మాజీ ఆటగాడు ఇకర్ కాసిలాస్ వేదికవద్దకు తీసుకొస్తున్నప్పుడు స్టేడియం మొత్తం చప్పట్లో మారుమోగింది. బ్రెజిల్ మాజీ ఆటగాడు రొనాల్డో వీఐపీ గ్యాలరీకి వెళుతున్నప్పుడు కూడా ప్రేక్షకులు పెద్దఎత్తున హర్షధ్వానాలతో అతని పట్ల ఉన్న అభిమానానాన్ని చాటుకున్నారు.
 
బ్రిటిష్ పాప్ సింగర్ రాబీ విలియమ్స్ రాకతో లుజ్నికీ స్టేడియం కొత్త అందాలను సంతరించుకుంది. సుమారు 500 మంది డాన్సర్లతో జరిగిన కార్యక్రమం అదిరిపోయింది. రష్యన్ సింగర్ ఐదా గారిఫిలినాతో కలసి విలియమ్స్ పాడిన ఏంజిల్స్ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బ్రెజిల్ లెజండరీ ఆటగాడు రొనాల్డో, రష్యా సిటీ ప్రముఖుడు ఎలెక్స్ మెఖలొవ్, దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తదితరులు ఈ కార్యక్రమంలో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచారు.
 
సౌదీ అరేబియా నుంచి వేలాదిగా అభిమానులు తరలిరావడంతో రష్యాతో ఆ జట్టు మొదటి మ్యాచ్‌లో తలపడినపుడు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే, అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో మ్యాచ్ సజావుగా సాగిపోయింది. 2016 యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో రష్యా హూలిగల్‌ను విచక్షణారహితంగా ఇంగ్లాండ్ అభిమానులపై దాడులకు దిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని వరల్డ్ కప్ సాకర్ నిర్వాహణ బృందం మరింత అప్రమత్తమైంది. అడుగడుగునా భద్రతా బలగాలను మోహరించింది.