మంటెక్కిస్తున్న వంట నూనె, కరోనా టైంలో సామాన్యుడి జేబుకు చిల్లు..
కరోనా మహమ్మారి ప్రభావంతో పేద, మధ్యతరగతి వర్గాల వారు కుదేలయ్యారు. కొద్ది నెలలుగా కోలుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నా.. ఏదో ఒక రూపంలో వీరిపై ఆర్థిక భారం పడుతూనే ఉంది. చమురు, వంట గ్యాసు ధరలతో పాటు నిత్యావసరాల్లో భాగమైన వంట నూనెలు కూడా దడ పుట్టిస్తున్నాయి.
గత రెండు నెలల నుంచి వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలే కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి, పనుల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు నిత్యావసరాల వ్యయం భరించలేనంతగా మారింది. కేంద్రం పర్యవేక్షించే 22 ముఖ్యమైన వస్తువుల ధరలు గత నెల రోజుల్లో విపరీతంగా పెరిగిపోయాయి. వాటిలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే ఆవాల నూనె, సోయాబీన్ నూనె ఉండటం గమనార్హం.
గత నెల రోజులుగా ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ప్యాకింగ్ చేసిన ఆవాల నూనె ధర లీటరుకు 6 రూపాయల మేర పెరిగింది. ఇదే సమయంలో కోల్‌కతాలో లీటరు ఆవాల నూనె ధర రూ.24 లేదా 16 శాతం పెరిగింది. కాగా, గత రెండు వారాల నుంచి దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకతో సహా చాలా రాష్ట్రాలు వారాంతపు లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలను విధించాయి. ఈ సమయంలో దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉన్నందువల్ల, వీటి ధరలు పెరగకుండా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
మధ్యతరగతి ప్రజలపై పెను భారం..
వినియోగదారుల మంత్రిత్వ శాఖ ధరల పర్యవేక్షణ పోర్టల్‌లో లభించిన గణాంకాల ప్రకారం.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో వంట నూనెలతో పాటు పప్పు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కిలో కంది పప్పు ధరలు గత నెలలో రెండు నుంచి పది రూపాయల వరకు పెరిగాయి. ముంబైలో పెసర పప్పు ధర కిలోకు గరిష్టంగా రూ.14 వరకు పెరిగింది. వీటితో పాటు సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ ధరల్లో కూడా వృద్ధి నమోదైంది.
ముంబై నగరంలో ఒక లీటరు ప్యాకింగ్ సోయాబీన్ ఆయిల్ ధర గత నెలలో రూ.134 వద్ద ఉండగా.. అది ఇప్పుడు రూ.152లకు పెరిగింది. ఇదే కాలంలో కోల్‌కతాలో లీటర్ సోయాబీన్ ఆయిల్ రూ.141గా ఉండగా, అది ఇప్పుడు రూ.160లకు పెరిగింది. కోల్‌కతాలో సన్ఫ్లవర్ ఆయిల్ ధర రూ.166 నుంచి రూ.189లకు పెరిగింది. ఈ విధంగా దేశంలో వంట నూనెల ధరలు అదే పనిగా పెరుగుతుండటంతో సామన్యుడు కుదేలవుతున్నాడు. ధరల పెరుగుదలపై చర్యలు తీసుకోవాలని సామాన్యులు ప్రభుత్వాలను కోరుతున్నారు.