గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (16:21 IST)

కిళ్లీ, పాన్, గుట్కా వంటివి నమిలే అలవాటు ఉంటే..?

కిళ్లీ, పాన్, గుట్కా వంటివి నమిలే అలవాటు ఉంటే తక్షణమే మానేయండి. వాటి వలన కలిగే అనర్థాలు తీవ్రంగా ఉంటాయి. పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిస్ ఉన్న వారు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. కిళ్లీ తింటే జీవక్రియలపై విపరీత ప్రభావం పడుతుందని, నడుము చుట్టుకొలత కూడా పెరుగుతుందని అధ్యయనాలలో తేలింది.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణంగా ఆహారం, వ్యాయామం పట్ల ప్రత్యేక దృష్టి పెడతారు. అయితే వారు మార్చుకోవాల్సిన జీవనశైలి అంశాల్లో కిళ్లీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కిళ్లీతో మధుమేహ ముప్పు ఉన్నట్లు తైవాన్‌ అధ్యయనంలో బయటపడటం, కిళ్లీలో వాడుకునే వక్కలతో నడుం చుట్టుకొలత పెరుగుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో తేలటం గమనార్హమని వివరిస్తున్నారు. 
 
ప్రత్యేకంగా యువకులలో మధుమేహం కిళ్లీ వలనే వస్తుండటం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. అందువల్ల మధుమేహంతో బాధపడేవారికి కిళ్లీ అలవాటు కూడా ఉందేమో అని వైద్యులు తెలుసుకుంటున్నారు. కిళ్లీ అలవాటును మానలేకపోతే మానసిక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. పాన్ తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని మరో అధ్యయనంలో తేలింది. 
 
దీనికి కారణం తమలపాకులపై రాసే సున్నం అని భావిస్తున్నారు. వక్కలు తినేవారిలో దీర్ఘకాల కిడ్నీజబ్బులు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. పొగ అలవాటు, మద్యపానం, మధుమేహం వంటి ఇతరత్రా కారణాలను ప్రక్కన పెట్టినా వక్కలే ప్రధాన కారణం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వక్కలు తినే వారిలో డి విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటోందని వైద్యులు పేర్కొంటున్నారు.