అన్నంలో గంజిని వార్చి పారబోస్తున్నారా?
అన్నంలో గంజిని వార్చి పారబోస్తున్నారా? కాస్త ఆగండి. అన్నంలో గంజిని వార్చి పారబోయడంతో దానిలో ఉన్న బి.విటమిన్ బయటకు వెళ్లిపోతుంది. బియ్యపు గింజపై ఉన్న పోషక పదార్థం రైస్‌మిల్లులో ఎక్కువ పాలీష్ చేయడం కారణంగా, బియ్యాన్ని అధికంగా రుద్ది కడగడంతో ఇది తొలగిపోతుంది. చివరకు గంజి వంపితే అది పూర్తిస్థాయిలో తొలిగిపోయే ప్రమాదం ఉంది. అన్నంలో గంజిని పారబోస్తే ఆ బి విటమిన్ తొలగిపోతుంది. అలా వంపిన నీరును గ్లాసుడు తీసుకుంటే రక్తహీనత తొలగిపోతుంది. రోజూ వంపిన గంజినీళ్లను గ్లాసుడు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
అలాగే రాగుల జావా, పల్లీల లడ్డూలు తింటే శరీరానికి అపారమైన ఐరన్ లభిస్తుంది. వారంలో రెండు, మూడు సార్లు తింటే రక్తహీనత దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వరి, గోధుమ, రాగులు, జొన్నలు, సజ్జలు, బంగాళదుంపలు, బీట్‌రూట్ తీసుకోవాలి. పప్పు దినుసులు, వేరుసెనగ విత్తనాలు, కందిపప్పు, బాదం పప్పు చేపలు, గుడ్లు, మాంసం తీసుకోవాలి. ఇలా చేస్తే రక్త హీనతకు చెక్ పెట్టవచ్చు.
ఇంకా ఆరోగ్యంగా వుండాలంటే.. పాలకూర, మెంతి, తోటకూర, గోంగూర, బచ్చల కూర, వంకాయ, బెండకాయ, సోరకాయ, మునక్కాయ, టమాటా, ముల్లంగి, క్యారట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తదితర కూరగాయలను వారం డైట్‌లో చేర్చుకోవాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.