శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 27 ఫిబ్రవరి 2020 (20:57 IST)

పుచ్చకాయలో వున్న పోషకాలు ఏమిటి?

వేసవి కాలం వస్తుందనగా మార్కెట్లోకి పుచ్చకాలు వచ్చేస్తాయి. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరిపోతుంది. అందులో సందేహం లేదు.
 
పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మీకు లభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి చాలా మంచివని పరిశోధనలు తెలియజేశాయి. వాటిలో ఎ, బి, మరియు సి - విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరు ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ లాంటివి అందులో ఉండవు. అది వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే నీటిని కలిగి ఉండడం వల్ల. 
 
ఎంపిక : సరియైన పుచ్చకాయను ఎంచుకోవాలి. మచ్చలుగానీ, దెబ్బలుగానీ లేని నిగనిగలాడే పుచ్చకాయను ఎంచుకోవాలి. దాన్ని చుట్టూ తిప్పి చూసినప్పుడు ఒక ప్రక్క మీకు పసుపు రంగు కన్పిస్తుంది. అలా పసుపు రంగు కన్పించడం చాలా మంచి సూచన. ఆ రంగు అది సూర్య కిరణాలలో పండిందని తెలియజేస్తుంది. అది తీయగా, రసభరితంగా ఉంటుందనడానికి కూడా అదే సూచన. పుచ్చకాయను తట్టినపుడు బోలుగా ఉన్నట్టు శబ్దం వస్తే అది పండిందని అర్థం. 
 
పుచ్చకాయ పెద్దదిగా ఉంటుందని, రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ చోటుని ఆక్రమించేస్తుందని మీరు ఎప్పుడూ వెనుకాడుతుంటారా?. కానీ, ప్రస్తుతం లెక్కలేనన్ని చిన్న పుచ్చకాయలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. కాబట్టి, ఈసారి పండ్ల షాపుకి వెళ్తే పుచ్చకాయ కొనడం మరచిపోకండి.