శివరాత్రి పర్వదినాన కన్నెలు ఉపవాసం చేస్తే..!?
శివునికి ప్రీతికరమైన మహాశివరాత్రి రోజున కన్నెలు ఉపవాసం చేస్తే పరమేశ్వరుడి లాంటి భర్త లభిస్తాడని విశ్వాసం. అలాగే ముత్తైదువులు శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ఆచరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు సుగుణవంతుడైన భర్త జీవితాంతం తోడుంటాడని పురోహితులు చెబుతున్నారు.
అందుచేత శివరాత్రి రోజున పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడంతో పాటు పుణ్య శైవక్షేత్రాలను సందర్శించడం శుభఫలితాలనిస్తుంది. ఇంకా లింగాకారములోని పరమేశ్వరుని నీరు, తేనే, పాలు, నెయ్యి, చక్కెరతో అభిషేకం నిర్వహిస్తే కన్నెపిల్లలకు నచ్చిన వ్యక్తే భాగస్వామి అవుతాడు. ఇంకా స్త్రీలు సుఖమయ జీవితం గడుపుతారు.
ఉపవాసంతో పాటు జాగరణ చేస్తూ, ఆలయాల్లో జరిగే అభిషేకాలను చూస్తూ "ఓం నమశ్శివాయ:" అనే పంచాక్షరి మంత్రంతో స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. జాగారం చేసే వారు రాత్రంతా శివుడిని మంత్రాలతో ప్రార్థించడం చేయాలి. ఉపవాసం ఉండే భక్తులు పండ్లు, పాలు తీసుకోవచ్చునని పురోహితులు చెబుతున్నారు.