ఉపాసన వంటకం.. రాగి మాల్ట్ విత్ బటర్ మిల్క్.. ట్రై చేయండి..
మెగాస్టార్ చిరంజీవి కోడలు, చెర్రీ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఆరోగ్యపరమైన చిట్కాలను పోస్టు చేస్తుంటారు. అలా ఉపాసన వేసవికాలానికి అనువుగా రాగి మాల్ట్ విత్ బటర్ మిల్క్ అనే రిసిపీ చేశారు. మజ్జిగతో రాగి జావ అని ఈ వంటకాన్ని చెప్పుకోవచ్చు. ఈ రాగి జావను సాయంత్రం పూట నాలుగు గంటలకు తీసుకోవచ్చునని.. ఉదయం 11 గంటల సమయంలో వేసవి కాలం తీసుకుంటే ఆరోగ్యానికి మేలే కాకుండా వేడి తగ్గించుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
రాగిపిండి - రెండు స్పూన్లు
నీరు - రెండు కప్పులు
మజ్జిగ - అరకప్పు
ఉప్పు - తగినంత
తయారీ విధానం ముందుగా రాగిపిండిని జారుగా నీటిలో కలుపుకోవాలి. ఈ రాగి మిశ్రమాన్ని ప్యాన్‌లో వేడైన నీటితో కలిపి.. గట్టిపడకుండా కలుపుతూ వుండాలి. రెండు మూడు నిమిషాల పాటు రాగిపిండి ఆ నీటిలో ఉడికిన తర్వాత గిలకొట్టిన మజ్జిగను గ్లాసులోకి తీసుకుని అందులో ఈ రాగి జావను చేర్చాలి. ఉప్పు తగినంత చేర్చుకుని.. కొత్తిమీర తరుగుతో సర్వ్ చేస్తే.. టేస్ట్ అదిరిపోతుంది. ఇలా ఉప్పు కలుపుకోవడం ఇష్టం లేకపోతే.. మజ్జిగతో కూడిన రాగిమాల్ట్‌ను పిల్లల కోసం బెల్లం, తేనెను కలుపుకుని సర్వ్ చేయొచ్చు.
ఇందులోని పోషక విలువలు..
గ్లాసుడు రాగి మాల్ట్ విత్ బటర్ మిల్క్‌ను తీసుకుంటే.. 105 కెలోరీలు, 5.0 జీ ప్రోటీన్లు పొందవచ్చు. ఇందులో ఐరన్, క్యాల్షియం, విటమిన్ సీ పుష్కలంగా వుంటుంది. ఇంకా తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో గల యాంటీ-ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తుంది. క్యాన్సర్ కారకాలపై పోరాడుతుంది.