గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (11:15 IST)

నిన్న రైనా.. నేడు భజ్జీ ఔట్ : సీఎస్కేకు దెబ్బమీద దెబ్బ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఐపీఎల్ 2020 టోర్నీ కోసం యూఏఈ వెళ్లిన ఈ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆ జట్టులోని కీలక బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగివచ్చాడు. 
 
ఇపుడు మరో కీలక బౌలర్ హర్భజన్ సింగ్ కూడా స్వదేశానికి రానున్నాడు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో ఉన్న హర్భజన్ సింగ్ ధోనీ టీమ్‌తో కలిసి దుబాయ్ కి వెళ్లలేదు. పైగా, తాను దుబాయ్‌కి ఎప్పుడు వస్తానన్న విషయాన్ని ఇంతవరకూ హర్భజన్ స్వయంగా వెల్లడించలేదు. 
 
ఈ విషయమై సీఎస్కే అధికారి ఒకరు వివరిస్తూ, "ఒకటో తేదీకల్లా హర్భజన్ దుబాయ్‌కి వచ్చి జట్టులో కలవాలి. ఈ విషయంలో ఇంతవరకూ అతన్నుంచి ఎటువంటి సమాచారమూ అందలేదు. వస్తాడో, రాడో కూడా తెలియదు. హర్భజన్ వచ్చి, క్వారంటైన్‌లో గడిపి, ప్రాక్టీస్ చేసి, జట్టులోకి రావాలంటే చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికైతే, ఈ సీజన్‌లో ఇక అతను ఆడబోడనే అనిపిస్తోంది" అని ఓ పత్రికా ప్రతినిధితో వ్యాఖ్యానించాడు.