మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (09:29 IST)

ఐపీఎల్ 2020 : తొలి గెలుపు కోసం ఆరాటం : కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీలో భాగంగా శనివారం రాత్రి అబుదాబీ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ జట్టు తన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. అలాగే, ఎస్ఆర్‌హెచ్ కూడా ఓటమిని చవిచూసింది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచితీరాలన్న కసితో ఇరు జట్లు ఉన్నాయి. 
 
ఈ టోర్నీల ముంబై ఇండియన్స్ చేతిలో కోల్‌కతా, బెంగళూరు చేతిలో హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెల్సిందే. హైదరాబాద్ చివరి వరకు పోరాడి ఓడగా కోల్‌కతా మాత్రం ఘోర పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో గెలిచే స్థితిలో ఉండి కూడా సన్‌రైజర్స్ చేజేతులా ఓటమి చవిచూసింది. బెంగళూరు గెలిచిందని చెప్పే కంటే హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ నిర్లక్షంగా ఆడి మ్యాచ్‌ను సమర్పించుకున్నారని చెప్పడమే సబబు. 
 
ఇక అబుదాబి వేదికగా జరిగే రెండో మ్యాచ్ ఇటు కోల్‌కతాకు, అటు హైదరాబాద్‌కు కీలకంగా మారింది. ఇందులో గెలవడం ద్వారా మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని ఇరు జట్ల క్రికెటర్లు భావిస్తున్నారు. ముంబైపై కోల్‌కతా రెండు విభాగాల్లోనూ విఫలమైంది. బౌలర్లు విఫలం కావడంతో ముంబై భారీ స్కోరును నమోదు చేసింది. 
 
ఇక బ్యాటింగ్‌లో కూడా కోల్‌కతా తేలి పోయింది. కీలక ఆటగాళ్లందరూ తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమయ్యారు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ పూర్తిగా నిరాశ పరిచాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్, స్టార్ ఆటగాడు ఆండ్రూ రసెల్ తొలి మ్యాచ్‌లో సత్తా చాటలేక పోయారు. అంతేగాక సునీల్ నరైన్, నితీష్ రానా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో కోల్‌కతాకు భారీ ఓటమి తప్పలేదు. 
 
ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనైన శుభ్‌మన్ గిల్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది. రసెల్, నరైన్, రానా, ఉతప్ప తదితరులు విజృంభిస్తే భారీ స్కోరు సాధించడం నైట్‌రైడర్స్‌కు కష్టమేమీ కాదు. ఇక పాట్ కమిన్స్ రూపంలో అగ్రశ్రేణి బౌలర్ ఉండనే ఉన్నాడు. కుల్దీప్ కూడా రాణిస్తే బౌలింగ్ కష్టాలు తీరడం ఖాయం.
 
అదేవిధంగా హైదరాబాద్ జట్టు బలం, బలహీనతలను పరిశీలిస్తే, తొలి మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈసారి బ్యాట్‌ను ఝులిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. వార్నర్ చెలరేగితే హైదరాబాద్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరి పోయినట్టే. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్‌పైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. 
 
ఇక మరో ఓపెనర్ జానీ బైర్‌స్టో ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశం. ఈ మ్యాచ్‌లో కూడా బైర్‌స్టో మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. మనీష్ పాండే కూడా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో మనీష్ బాగానే ఆడినా భారీ స్కోరు మాత్రం సాధించలేక పోయాడు. ఈసారి మరింత మెరుగైన ఆటను కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. 
 
ఇక విజయ్ శంకర్ తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈసారైన రాణిస్తాడా లేదా అంతుబట్టడం లేదు. బౌలింగ్‌లో మాత్రం హైదరాబాద్ బాగానే ఉంది. తొలి మ్యాచ్‌లో బౌలర్లు ఫర్వాలేదనిపించారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తున్నారు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరగా సాగడం ఖాయంగా తెలుస్తోంది. 
 
అంతేకాకుండా, ఈ వేదికపై కేకేఆర్ జట్టు మొత్తం 4 మ్యాచ్‌లు ఆడగా, ఒక మ్యాచ్‌లో గెలుపొంది, మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. అలాగే హైదరాబాద్ జట్టు కూడా రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో ఓడింది, మరో మ్యాచ్‌లో విజయం సాధించింది. అలాగే, ఇరు జట్లు ఇప్పటివరకు 17 మ్యాచ్‌లలో తలపడగా, 10 మ్యాచ్‌లలో కేకేఆర్ జట్టు, 7 మ్యాచ్‌లలో ఎస్ఆర్‌హెచ్ జట్టూ విజయం సాధించింది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో అండ్రూ రస్సెల్ మరో 89 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 1500 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అలాగే, సిద్ధార్థ్ కౌల్ ఐపీఎల్‌లో 50 వీకెట్లను పూర్తి చేయడానికి మరో వికెట్ దూరంలో ఉన్నాడు. సునీల్ నరైన్ మరో ఐదు సిక్స్‌లు బాదితే ఐపీఎల్‌లో 50 సిక్సులు పూర్తి చేసుకోనున్నాడు. సందీప్ శర్మ ఐపీఎల్‌లో వంద వికెట్ల క్లబ్‌లో చేరేందుకు మరో ఐదు వికెట్ల దూరంలో ఉన్నాడు.
 
కేకేఆర్ జట్టు (అంచనా)
సునీల్ నరైన్, శుభమన్ గిల్, నితీష్ రానా, ఇయాన్ మోర్గాన్, అండ్రూ రస్సెల్, దినేష్ కార్తీక్ (కెప్టెన్), నిఖిల్ నాయక్, పాట్ కుమ్మిన్స్, కుల్దీప్ యాదవ్, సందీప్ వారియర్, శివం మావి. 
 
ఎస్ఆర్‌హెచ్ జట్టు (అంచనా) 
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే, విజయ్ శంకర్, ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, మిచెల్ మార్ష్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ.