ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 12 ఏప్రియల్ 2017 (02:11 IST)

భర్తకు జరిగిన అవమానానికి ప్రతీకారం వెరైటీగా తీర్చుకున్న ఆధునిక పతివ్రత

భర్తకు జరిగిన అవమానాన్ని తనకు జరిగిన అవమానంగా భావించి రక్త సంబంధాలనే దూరం చేసుకునే మన విలువలకు భారతం, రామాయణాలే కొలమానాలు. అందుకే భారతదేశంలో తీస్తున్న ప్రతి సినిమాకూ మాతృక భారత, రామాయణాలే అని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటికి వందలసార్లు చెప్పి ఉంట

భర్తకు జరిగిన అవమానాన్ని తనకు జరిగిన అవమానంగా భావించి రక్త సంబంధాలనే దూరం చేసుకునే మన విలువలకు భారతం, రామాయణాలే కొలమానాలు. అందుకే భారతదేశంలో తీస్తున్న ప్రతి సినిమాకూ మాతృక భారత, రామాయణాలే అని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటికి వందలసార్లు చెప్పి ఉంటాడు. సరిగ్గా ఈ సత్యాన్నే మరోసారి నిరూపించి చూపింది ఒక ఆధునిక పతివ్రత.
 
తన భర్త ధోనీని అవమానించిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ యాజమాన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి భార్య సాక్షి ధోని ఒక అద్భుతమైన సెల్ఫీతో ముందుకొచ్చింది. సస్పెండైన ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ లోగో ఉన్న హెల్మెట్ పెట్టుకుని దిగిన సెల్ఫీని సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ ఫొటో కింద ఆమె చేసిన ఘాటైన వ్యాఖ్యలు పోస్ట్ చేసింది.  
 
'పక్షులు బతికున్నప్పుడు చీమలను తింటాయి. పక్షి చనిపోయిన తర్వాతే చీమలు దాన్ని తింటాయి. సమయం, పరిస్థితులు ఎప్పుడైనా మారిపోతాయి. జీవితంలో ఎవరినీ తక్కువ చేసేలా లేదా అవమానించేలా ప్రవర్తించవద్దు. ఈ రోజు నీవు బలవంతుడు కావచ్చు. అయితే నీ కంటే టైమ్ చాలా బలమైనదని గుర్తు పెట్టుకో. ఓ చెట్టు పదిలక్షల అగ్గిపుల్లలను అందిస్తుంది. అయితే పది లక్షల చెట్లను కాల్చడానికి ఓ అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచిగా ఉండు. మంచి చేయి' 
 
సాక్షి చేసిన సెల్ఫీ కామెంట్ నెటిజన్లలో బాగా పేలింది. తన భర్త ధోనీని అవమానించిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ యాజమాన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు సాక్షి ఈ వ్యాఖ్యలు చేసిందా అన్నంతగా ఈ తాజా సెల్ఫీ చర్చనీయాంశంగా మారింది.
 
గతంలో ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించిన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు అధికారులపై బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఐపీఎల్‌ నుంచి ఈ జట్టును రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు. ధోనీ ప్రస్తుతం పుణెకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా ఈ సీజన్‌లో పుణె యాజమాన్యం ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించింది. పుణె యాజమాన్యానికి, అతనికి పడటం లేదని ఇటీవల వార్తల నేపథ్యంలో. టీమ్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త అయిన హర్ష్ గోయెంకా మహీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పరుష వ్యాఖ్యలు చేశారు. దీనిపై ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ధోనీ భార్య సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టింగ్ కలకలం రేపుతోంది.
 
ఏదేమైనా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి రావత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫీ, వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.