బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథలు
Written By
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (14:58 IST)

సింహం - చిట్టెలుక... బలవంతుడని విర్రవీగితే...

ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలుపై ఎక్కింది.
 
అంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలు కింద చిట్టెలుకను అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది.
 
చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... "ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం..." అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. 

ఐతే ఆ తర్వాత కొద్దిరోజులకు ఓ వేటగాడు జింకలను పట్టుకునేందుకు వల వేశాడు. ఆ వలలో జింకకు బదులు సింహం చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. ప్రయత్నం చేసిచేసీ అలసిపోయింది. ఆకలితో డస్సిపోయి సొమ్మసిల్లింది. అటుగా వచ్చిన చిట్టెలుక సింహం పరిస్థితి చూసి చలించిపోయింది.

వెంటనే తన పళ్లకు పని చెప్పింది. పటపటమంటూ వలను కొరికేసింది. సింహంపై చిన్నచిన్నగా చిందులు వేసింది. దీనితో శక్తినంతా కూడదీసుకున్న సింహం కళ్లు తెరిచింది. ఆశ్చర్యం తను ఇరుక్కున్న వల అంతా ముక్కలైపోయింది. ఎదురుగా చిట్టెలుక నిలబడి వుంది. ఎలుక చేసిన సాయానికి సింహం కృతజ్ఞత చెప్పింది. అందుకే శక్తిలో కానీ ధనంలో కానీ ఎంత చిన్నవారయినప్పటికీ వారిని చిన్నచూపు చూడకూడదు.