గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ కవితలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (11:21 IST)

వక్రమార్గంలో అక్రమార్జన వద్దు.. మంచి మార్గాన్ని ఎంచుకో...

అందంగా అలంకరించబడిన గది
మంజరి అందాల ముందు ఆ రంభా ఊర్వశులు దిగదుడుపే
పడకపై పడుకొంది, తన అందాలను పలుమార్లు చూచుకొంది
తన అధరాల మధురాలను అందించే సమయం ఆసన్నమైంది
 
కొద్దిసేపట్లో సరస సల్లాపాలు
ఆపై తనకు లక్ష రూపాయల ఆదాయం
కొద్ది క్షణాల ఆనందం, డబ్బు కోసం సహవాసం
వచ్చిన వాడు పని పూర్తి చేసుకున్నాడు
బట్టలు మార్చుకొని బయలు దేరాడు
 
గది పూర్తిగా ప్రకాశవంతమైంది
దాహం దాహం అంటుంది సొమ్మసిల్లిన ఆమె
లేరచట అందించే వారెవ్వరూ
శరీరంపై లక్ష రూపాయలు రెప రెపలాడుతున్నాయి
బలవంతంగా కళ్ళు తెరచి చూసింది, అంతా శూన్యం
 
ఏమిటి వెతుకుతున్నావు?
నీవు పోగొట్టుకున్నది ఇక రాబట్టుకో లేవు
అహంకారముతో కళ్ళు మూసుకున్నావు
విలాసాలకు బానిసయ్యావు
వక్రమార్గములో అక్రమార్జనకు పాల్పడ్డావు
 
సమాజములో స్వేచ్ఛగా, గౌరవంగా బ్రతికే మార్గాలెన్నో వున్నా
ముళ్ళ బాటను ఎంచుకున్నావు
చేసిన తప్పును సరిదిద్దుకో
మనసు మార్చుకో, మంచిని వెదుక్కో
శేష జీవితమైనా సుఖమయం చేసుకో

ఆ మంచి మాటలు ఆమెను కదిలించాయి,
జ్ఞానోదయం కలిగింది
ఆ మురికి కూపం నుండి బయట పడింది
అనాథాశ్రమానికి వెళ్ళింది,
లక్ష రూపాయలను వాళ్ళకిచ్చింది
వారి సేవకై తానూ స్థిరపడి పోయిందక్కడే.

--- గుడిమెట్ల చెన్నయ్య