సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (17:05 IST)

శివరాత్రి రోజున బియ్యం పిండితో శివునికి అభిషేకం చేయిస్తే? (Video)

అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతాయి.

అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట. అదీ అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇంకా శివరాత్రి రోజున శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే.. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
ముందుగా పసుపు పొడితో శివునికి అభిషేకం చేయిస్తే.. ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజనపొడితో అభిషేకం చేయిస్తే.. దైవానుగ్రహం లభిస్తుంది. గ్రహదోషాలు తొలగిపోతాయి. బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే.. ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. 
 
పంచామృతంతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నేతిలో శివాభిషేకం చేస్తే.. మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే.. ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయిపండ్ల రసంతో శివాభిషేకం చేస్తే.. ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరకు రసంతో శివాభిషేకం చేయిస్తే.. ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. 
 
నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే.. శత్రుభయం వుండదు. యమభయం వుండదు. కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే.. ఉన్నత పదవులు, హోదా, గౌరవం, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయపొడితో శివాభిషేకం చేయిస్తే.. రోగాలు మటుమాయం అవుతాయి. పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తిప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.
 
అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతిబాధలుండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరునికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన గాత్రం సొంతం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇంకా బిల్వ పత్రాలు, పువ్వులను శివపూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి బిల్వపత్రాలను శివాలయానికి చేరవేస్తే.. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.