1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (17:17 IST)

కొల్లాం - చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ముప్పు

kollam express
తమిళనాడు రాష్ట్రంలో మరో రైలుకు ప్రమాదం తప్పింది. కొల్లాం - చెన్నై ప్రాంతాల మధ్య నడిచే చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు రైల్వే సిబ్బంది అప్రమత్తతో ఈ ప్రమాదం జరగలేదు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 4వ తేదీన కొల్లాం నుంచి చెన్నై ఎగ్మోర్‌కు చెన్నై ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. ఈ రైలు సెంగోట్టై స్టేషన్‌కు సాయంత్రం 3 గంటల సమయంలో చేరుకుంది. ఈ రైలుకున్న ఎస్ 3 కోచ్ బేస్ వద్ద పగుళ్లు ఏర్పడినట్టు రైల్వే సిబ్బంది గుర్తించారు. 
 
దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు.. రైలును అక్కడే నిలిపివేసి తగిన చర్యలు చేపట్టారు. ఆ తర్వాత గంట ఆలస్యం తర్వాత ట్రైన్ ముందుకు వెళ్లింది. ఈ పగుళ్లను గుర్తించిన సిబ్బందిని అభినందనలు తెలుపుతామని మదురై డివిజన్ రైల్వే మేనేజర్ వెల్లడించారు. 
 
షాలిమార్ - చెన్నై సెంట్రల్ మధ్య నడిచే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 275 మంది వరకు చనిపోయారు. ఈ ప్రమాదం నుంచి తేరుకోకముందే ఒడిశాలోనే ఒక గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఇపుడు రైల్వే సిబ్బంది అప్రమత్తతో కొల్లాం చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. 
 
గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాకే లూప్ లైన్‌లోకి వెళ్లింది... లోకో పైలెట్ గుణనిధి మొహంతి 
 
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌ వద్ద జరిగిన మూడు రైళ్ల ప్రమాద ఘటనలో షాలిమార్ - చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలెట్ గుణనిధి మొహంతి చివరిగా చెప్పిన మాటలు ఇపుడు కీలకంగా మారాయి. తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అపుడే లూప్ లైనులోకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు. కానీ, లూప్‌లైనులో గూడ్సు రైలు ఆగివుండటంతో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. లోకో పైలెట్ మహంతి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే, ఆయన  చివరి మాటలు ఇపుడు విచారణలో అత్యంత కీలకంగా మారాయి. 
 
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో గూడ్సు రైలును ఢీకొట్టినట్టుగా రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కానీ, ఈ ఎక్స్‌ప్రెస్ రైలు‌కు తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే లూప్ లైనులోకి వెళ్లిందని, సిగ్నల్ జంప్ కాలేదని లోకే పైలెట్ గుణనిధి మొహంతి తెలిపారు. సిగ్నల్ విషయంలో ఏం జరిగిందో లోకో పైలెట్ వివరించారు.