సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (12:41 IST)

లాలూ ప్రసాద్ యాదవ్‌కు పునర్జన్మను ప్రసాదించనున్న కుమార్తె?

lalu prasad yadav
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పునర్జన్మ పొందనున్నారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ మార్పిడి చికిత్సను వైద్యులు సూచించారు. దీంతో కిడ్నీ దానం చేసేందుకు ఆయన రెండో కుమార్తె రోహిణి ముందుకు వచ్చారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెలాఖరులో లాలూకు కిడ్నీ మార్పిడి చికిత్స సింగపూర్‌లో జరుగుతుంది. 
 
లాలూ ప్రసాద్ యాదవ్ సింగపూర్ పర్యటనకు వెళ్ళిన సమయంలో అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ సమయంలో వైద్యులు కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకుంటే ఫలితం ఉంటుందని వైద్యులు సూచించారు. అలా చేస్తే లాలూను మరికొంతకాలం ప్రాణాలతో కాపాడుకోవచ్చని చెప్పినట్టు సమాచారం.
 
దీంతో లాలూ రెండో కుమార్తె రోహిణి తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కుమార్తె కిడ్నీ దానం చేసేందుకు లాలూ ప్రసాద్ అంగీకరించలేదు. కానీ, కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీ తీసుకుని మార్పిడి చేయడం వల్ల అధిక సక్సెస్ రేటు ఉంటుందంటూ రోహిణి తన తండ్రిని ఒప్పించారు.
 
ఇదే జరిగితే ఈ నెల 220-24 తేదీల మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ సింగపూర్‌కు వెళ్లనున్నారు. ఆ సమయంలోనే అక్కడ ఆయనకు కిడ్నీ మార్పిడి చికిత్స చేసే అవకాశం ఉంది. కాగా, లాలూ గత కొన్ని నెలలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే.