శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:20 IST)

ప్రాణాలు తీసిన టిక్‌టాక్ వీడియో..

ప్రస్తుతం యువతలో ఎక్కువ మంది పబ్‌జీ గేమ్‍‌ను మరియు టిక్‌టాక్ వీడియోలను వెర్రిగా ప్రేమిస్తున్నారు. ఈ రెండు యాప్‌లకు యువకులు పూర్తిగా అడిక్ట్ అయిపోయారు. తాజాగా టిక్‌టాక్ యాప్ వెర్రి ఓ యువకుని ప్రాణాలను బలి తీసుకుంది. సల్మాన్‌, సొహైల్‌, అమీర్‌ అనే ముగ్గురు యువకులు ఆదివారం సాయంత్రం నాడు కారులో ఇండియా గేట్ వరకు వెళ్లారు. 
 
బాగా ఎంజాయ్ చేసి ఇంటికి బయల్దేరిన తర్వాత టిక్‌టాక్ వీడియో చేయాలనే ఆలోచనతో కారు నడుపుతున్న సల్మాన్‌పై నాటు తుపాకీని తలకి గురిపెట్టి టిక్‌టాక్ వీడియో చేయాలని అనుకున్నారు.
 
నాటు తుపాకీని తలకి గురిపెట్టి సొహైల్ టిక్‌టాక్ చేస్తుండగా..అది ప్రమాదవశాత్తూ పేలడంతో సల్మాన్(19) అక్కడికక్కడే చనిపోయాడు. రక్తపు మడుగులో కుప్పకూలిన సల్మాన్‌ను చూసి వెనక సీట్‌లో ఉన్న అమీర్‌, సొహైల్‌ ఒక్కసారిగా భయపడిపోయారు. వెంటనే స్నేహితుడి ఇంటికి వెళ్లి రక్తపు మరకల బట్టలను మార్చుకుని సల్మాన్‌ను సమీపంలోని ఎల్‌ఎన్‌జెపీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే సల్మాన్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
 
సల్మాన్ చనిపోయాడని తెలుసుకున్న సొహైల్, అమీర్ అక్కడి నుండి పారిపోయారు. హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సల్మాన్ మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి పంపారు. న్యూఢిల్లీలోని న్యుజఫారాబాద్‌కు చెందిన సల్మాన్ ఇంట్లో చిన్నకొడుకు. తండ్రి వ్యాపార వేత్త. ఓ అన్న, అక్క కూడా ఉన్నారు.