గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 మార్చి 2022 (12:09 IST)

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి రెండోసారి ప్రమాణ స్వీకారం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం అయ్యింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో లక్నోలోని ఎకానా స్టేడియంలో వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
 
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
 
మరోవైపు.. బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్‌ కుమార్‌, కంగనా రనౌత్‌, అజయ్‌ దేవగణ్‌, బోనీ కపూర్‌ హాజరుకానున్నారు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్‌, చిత్రబృందం ప్రత్యేక అతిథులుగా ప్రమాణస్వీకారానికి రానున్నారు. పలువురు వ్యాపార దిగ్గజాలకు కూడా ఆహ్వానాలు అందాయి.  
 
ఇకపోతే.. లక్నోలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. అమిత్ షా సమక్షంలో.. యోగి ఆధిత్యనాథ్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. రెండోసారి యూపీలో విజయం సాధించి… బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు అమిత్ షా. ఇక, తర్వాత గవర్నర్‌ ఆనంది బెన్‌ పటేల్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని కోరారు. దీంతో యోగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.