శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By మనీల
Last Modified: మంగళవారం, 1 అక్టోబరు 2019 (17:44 IST)

నోరూరించే నెల్లూరు చేపల పులుసు తయారీ ఎలా?

కావలసినవి:
చేపలు             -  అరకిలో
నువ్వుల నూనె  -  ఆరు టేబుల్‌‌‌స్పూన్లు
ఆవాలు           -  అర టీస్పూన్
జీలకర్ర            -  అర టీస్పూన్
మెంతులు        -  అర టీస్పూన్
మిరియాలు      -  అర టీస్పూన్
ఎండుమిర్చి      -  మూడు 
కరివేపాకు        -  కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు  -  ఐదు
అల్లం ముక్క     -  చిన్నది
పచ్చిమిర్చి       -  నాలుగు
ఉల్లిపాయలు     -  నాలుగు
చింతపండు       -  పెద్ద నిమ్మకాయ సైజంత
టొమాటోలు      -  ఆరు
పసుపు           -  టీస్పూన్
కారం              -  రెండు టీస్పూన్
ధనియాల పొడి -  మూడు టీస్పూన్
ఉప్పు            -  రుచికి తగినంత
 
తయారీ విధానం:
ఒక పాన్‌‌లో నువ్వుల నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. మెత్తగా దంచిన అల్లం కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగించాలి. చింతపండును రెండు కప్పుల నీళ్లలో 20నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. టొమాటోలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులో చింతపండు రసం, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేయాలి. అవసరమైతే మరో రెండు కప్పుల నీళ్లు పోసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని వేగించిన ఉల్లిపాయల మిశ్రమంలో పోయాలి. చిన్న మంటపై అరగంటపాటు ఉడికించాలి. గ్రేవీ ఉడికిన తరువాత చేప ముక్కలు వేసి మరికాసేపు ఉడికించాలి. కూర ఉడుకుతున్న సమయంలోనే మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మిరియాలను వేగించి పొడి చేసుకోవాలి. ఈ మసాల పొడిని కూరలో వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్‌‌పై నుంచి దింపుకోవాలి. అంతే నోరూరించే నెల్లూరు చేపల పులుసు రెడీ.