బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (08:01 IST)

నాగుల చవితి: పుట్టలో పాలు, పూజ ఎలా చేయాలి.. ఈ శ్లోకం.. ఈ మంత్రం చదివితే?

nagula chavithi
నాగుల చవితిని శాస్త్ర ప్రకారం చవితి రోజునే జరుపుకోవాలని.. నవంబర్​ 5వ తేదీన సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు చవితి తిథి ఉంది. కాబట్టి నవంబర్ 5వ తేదీ మంగళవారం రోజు నాగుల చవితి జరుపుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
నవంబర్​ 5వ తేదీన మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8.20 గంటల మధ్యలో పుట్టలో పాలు పోయవచ్చని చెబుతున్నారు. అలాగే ఉదయం 9.10 గంటల నుంచి మధ్యాహ్నం 12.40 గంటలలోగా పుట్టలో పాలు పోయడానికి మంచి సమయమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

జంట నాగుల విగ్రహాల తోకల దగ్గర సువాసన కలిగిన పూలను అలంకరించి అనంతరం జిల్లేడు ఆకులో బెల్లం ముక్క ఉంచి నైవేద్యంగా పెట్టాలి. వీలైతే ఆ విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలని సూచిస్తున్నారు. పుట్టపై పసుపు కలిపిన నీటిని చల్లాలి. ఆ తర్వాత పుట్టపై కొద్దిగా బియ్యప్పిండి, పసుపు, కుంకుమ చల్లాలి.
 
నాగుల చవితి రోజు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు కలి బాధలు, కలిదోషాలు పోవాలంటే ఈ శ్లోకం పఠించాలి.
 
కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ!
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్
 
పూర్వం నాగుల చవితి రోజు భూమి మీద దున్నడం, మట్టిని తవ్వడం, చెట్టు, పుట్టలను కొట్టడం, కూరగాయల కోయడం, వంటలు చేయకూడదంటారు. కానీ ఇప్పుడు వీటిని పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. పాములు రక్షకులు అని ఆరోగ్యం, సంతానోత్పత్తి, శ్రేయస్సును తీసుకొస్తాయని నమ్ముతారు. కార్తీక శుక్ల పక్షం చవితి తిథి రోజు నాగ దేవతను ఆరాధించడం వల్ల.. సర్ప దోష నివారణ కలుగుతుంది. ఈ రోజు సుబ్రహ్మణ్యుడిని ఆరాధించడం ద్వారా జీవితంలో సుఖ శాంతులు కలుగుతాయి. అలాగే సర్ప దోషంతోపాటు ఇతర వ్యాధులకు సంబంధించిన దోషాలు సైతం తొలుగుతాయని భక్తులు భావిస్తారు.
 
నువ్వులతో చేసిన చిమ్మిలి ఊండతోపాటు బెల్లం, పెసరపప్పు, చలివిడి నైవేద్యంగా సమర్పించాలి. అదే విధంగా నాగుల చవితి, నాగ పంచమి రోజు.. సుబ్రహ్మణ్యాష్టకాన్ని 8 సార్లు చదవాలి. అదే విధంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సైతం ఈ రోజు పారాయణం చేయడం వల్ల భక్తులు మంచి ఫలితాలను అందుకుంటారని శాస్త్ర పండితులు వెల్లడిస్తున్నారు.