1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2019 (12:01 IST)

నాగుల చవితి రోజున పూజ.. పాలాభిషేకం.. నేతి దీపంలో అష్టైశ్వర్య సిద్ధి..!

నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. నాగుల చవితి రోజున ఉదయం ఐదింటికి లేచి, శుచిగా స్నానమాచరించి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరం, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్ర్తాన్ని పరచాలి. నాగేంద్రస్వామి ప్రతిమను గానీ, లేదా ఫోటోను గానీ పూజకు ఉపయోగించాలి.
 
పూజకు మందారపూల, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు.. నైవేద్యమునకు చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము. నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో ఓం నాగేంద్రస్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
 
దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపములతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి. ఇకపోతే.. నాగుల చవితి నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం.
 
అలాగే.. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు. 
 
ఆ రోజు ఆలయాల్లోని నాగదేవతలకు పాలాభిషేకం చేయించడం ద్వారా పూర్వ జన్మల పాపాలు తొలగిపోతాయి. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సాయంత్రం ఐదు గంటల సమయంలో నాగదేవతా విగ్రహాలను పసుపు, కుంకుమ, పువ్వులలతో అలంకరించి నేతితో దీపం వెలిగించిన వారికి శుభఫలితాలు వుంటాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.