బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (14:19 IST)

గాలిమేడలు: అందమైన అమ్మాయిలనిచ్చి వివాహం చేసేందుకు పోటీ పడుతుంటారు

Beauty
కోటయ్య సదాచారపరాయణుడు. ఓ రోజు ఆ ఊరిలో ఒకరి ఇంట వ్రతం జరుగుతుండగా ఆ ఇంటివారు కోటయ్యకు సంచెడు ధాన్యం దానంగా ఇచ్చారు. వాటిని భుజాన వేసుకుని ఎర్రటి ఎండలో ఇంటిముఖం పట్టాడు. దారిలో సేద తీరేందుకు కుండలు చేసే కుమ్మరి ఇంటివాని అరుగు మీద నడుం వాల్చాలనుకున్నాడు. అందుకు కుమ్మరి అనుమతి కూడా తీసుకున్నాడు. అలా అరుగుమీద సేద తీరి తన ధాన్యం మూట గురించి ఇలా ఆలోచించసాగాడు.

 
ధాన్యం మూటలోని గింజల్ని విత్తనాలుగా నా పెరటిలో వేస్తే కొన్నాళ్లకు వందరెట్లు పెరిగి పంట చేతికి వస్తుంది. ఆ పంట ధాన్యాన్ని కొన్ని ఎకరాల్లో నాటితే చెప్పలేనన్ని పుట్లు ధాన్యం పండుతుంది. ఆ పంటలను మరలా కోసి అమ్మితే వచ్చే డబ్బుతో పాడిపశువుల్ని కొని పాలు అమ్మితే కొన్ని వేల లీటర్ల ఆదాయం వస్తుంది. అప్పుడు నేను కాలు మీద కాలు వేసుకుని మహారాజులా బతుకుతాను.

 
నా సంపద చూసిన బంధువులు, అందమైన తమ అమ్మాయిలను ఇచ్చి వివాహం జరిపేందుకు పోటీ పడుతుంటారు. ఐతే నేను మాత్రం ఛీకొట్టి నా అంతస్తుకు తగరని చెప్తాను అనుకుంటుండగా చుట్టరికానికి వచ్చినవారు కాళ్లావేళ్లా పడుతారు. అప్పుడు నేను ఊరుకోకుండా కాలితో ఓ తన్ను తంతాను అంటూ తన కాళ్ల వద్ద వున్న కుండల దొంతరలను తన్నేసాడు. కుండలన్నీ పగిలిపోయాయి. ఆ ఇంటివాడు, కుమ్మరి అలా కోటయ్య కుండలను తన్నడం, కుండలన్నీ పగిలిపోవడం చూసి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతడిని దుర్భాషలాడుతూ అక్కడి నుంచి తరిమివేసాడు. అందుకే గాలిలో మేడలు కట్టవద్దని పెద్దలు చెపుతుంటారు.