ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 22 ఫిబ్రవరి 2025 (20:37 IST)

నేను రేయింబవళ్లు కష్టపడుతున్నా... కానీ నీకెలా విజయం వస్తుంది కాలపురుషా?

success
మనిషికి తిండి, పని, నిద్ర... ఇవి తప్పనిసరి. పగటివేళ సూరీడు వెలుతురు సమయంలో పని చేసి రాత్రివేళ చంద్రుడు రాగానే నిద్రించమని పెద్దలు చెప్పారు. కాకపోతే... ఈ ఫార్ములాలో కాస్త మార్పు వచ్చిందనుకోండి. కొంతమంది గుడ్లగూబల్లా రాత్రివేళల్లోనూ పనిచేస్తున్నారు. ఐతే ఎంత చేసినా ఫలితం అనుకున్నంతగా సాధించలేకపోతున్నామనే బెంగ ప్రతి మనిషిలోనూ కాస్తయినా వుంటుంది. అలాంటి ఓ రోజు... మానవుడు తనకంటే అన్ని విషయాల్లో విజయం సాధిస్తున్న కాలపురుడు కోసం ధ్యానించాడు. మనిషి మొర విన్న కాలపురుషుడు అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు.
 
వెంటనే మనిషి తన అనుమానాన్ని కాలపురుషుడి ముందు వుంచాడు. నీ విజయ రహస్యం ఏమిటి అని అడిగాడు. అపుడా కాలపురుషుడు... నేను నిరంతరం ముందుకు వెళుతూనే వుంటాను. గతంలో జరిగిన విషయాలను, అపజయాలను తలుచుకుని బాధపడను. రేపటి విజయం కోసం, లక్ష్యం కోసం నా ప్రయాణం సాగుతుంది. కనుక నా సమయం ఎక్కడా వృధా కాదు. వర్తమానంలో చేయాల్సినదంతా చేసుకుంటూ విజయం వైపు అడుగులు వేస్తుంటాను. ఫలితం ఎలా వుంటుందనేది కూడా నేను పట్టించుకోను. నా కర్మలను అనుసరించి అన్నీ చేస్తుంటాను. అదే నా విజయ రహస్యం.
 
కానీ మనుషులు ఏం చేస్తున్నారు? గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. తనకంటే ఉన్నతంగా వున్న వ్యక్తిని చూసి ఈర్ష్య చెందుతుంటారు. అలా వారి జీవిత ఉన్నతికి నిర్దేశించిన సమయాన్ని వృధా చేస్తుంటారు. తన జీవిత పయనం, మార్గం, లక్ష్యం వైపు అడుగులు వేయడంలో తడబడుతూనే వుంటారు. ఎవరైతే తన లక్ష్యాన్ని ఓ కాంతికిరణంలా స్పష్టంగా నిర్దేశించుకుంటారో వారు జీవితంలో విజయం సాధించడం తథ్యం అని చెప్పి అంతర్థానమయ్యాడు.