డిసెంబర్ 13న పోలి పాడ్యమి.. బియ్యపు పిండితో దీపాలను..?
డిసెంబర్ 12 కార్తీక అమావాస్య వస్తోంది. డిసెంబర్ 13ని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజున కార్తీకమాసం ముగిసి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో నియమం పాటించేవారు... కార్తీక అమావాస్య మర్నాడు.. మార్గశిర మాసం మొదటిరోజు పాడ్యమి రోజున దీపాలు వెలిగిస్తారు. ఆ రోజుతో కార్తీకమాసం పూర్తవుతుంది.
కార్తీకమాసం చివరిరోజును పోలి స్వర్గంగా వ్యవహరిస్తారు. హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది. ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి.. నదులలో వదులుతారు.
భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున మహిళలు ప్రాతః కాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడుతారు. బియ్యపు పిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు.
ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీమహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలిస్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు.