గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 13 మే 2021 (22:34 IST)

మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు

నరసింహ స్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు, ఆ స్వామి మంత్రమూర్తి. వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తులలో నరసింహ తత్వం వర్ణించబడి వుంది. స్వామి నామ మంత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్ధం అందులో నిబిడీకృతమై వున్నట్లు తెలుస్తుంది.
 
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం
 
పైన తెలుపబడింది నృశింహ మంత్రం. ఇందులో వున్న ఒక్కొక్క నామం నృశింహుని ఒక్కో తత్త్వాన్ని తెలియజేస్తుంది. ఉగ్రం అంటే... నృశింహుడు ఉగ్రమూర్తి. నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది. వీరం అంటే.. సకల కార్యకారణాలకు మూలంగా వున్న శక్తినే వీరం అంటారు. నరసింహుడు వీరమూర్తి. కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే.

మహావిష్ణుం అంటే... అన్ని లోకాల్లో అంతటా వుండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక. సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ పరమాత్మ భాసిస్తాడు. జ్వలంతం అంటే... సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్త్వమే జ్వలంత శబ్దానికి అర్థం.
 
సర్వతోముఖం అంటే... ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్త్వమే సర్వతోముఖత్వం. నృసింహం అంటే.. సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్ఠమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు.
 
భీషణం అంటే... నరసింహుని శాసనశక్తి ప్రతీక భీషణత్వం. అత్యంత భయంకరమైన రూపం ఇది. భద్రం అంటే.. భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. ఇదే భద్రత్వం. మృత్యుమృత్యుం అంటే.. స్మరణ మాత్రం చేత అప మృత్యువును దూరం చేసేవాడు. మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే. మృత్యువును కలిగించేదీ, మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే.