గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 30 మార్చి 2018 (19:28 IST)

నేనే ఈ విశ్వాన్ని అని భావించు... అప్పుడు ఏమవుతుందంటే?

మనం మనస్సును నిరోధించటానికి ముందు, దాన్ని పరీక్షించాలి. మనసు చంచలమైనది. దీన్ని పట్టుకుని చలింపకుండా ఒకే భావంలో నిలపాలి. ఇలా నింరతరం చేయాలి. ఇచ్చాశక్తి వల్ల మనసును నిగ్రహించి, ఈశ్వరునిలో నిలిపి ఉంచగలుగుతాం. మనసుని నిగ్రహించటానికి చాలా తేలిక మార్గం ఒకట

మనం మనస్సును నిరోధించటానికి ముందు, దాన్ని పరీక్షించాలి. మనసు చంచలమైనది. దీన్ని పట్టుకుని చలింపకుండా ఒకే భావంలో నిలపాలి. ఇలా నింరతరం చేయాలి. ఇచ్చాశక్తి వల్ల మనసును నిగ్రహించి, ఈశ్వరునిలో నిలిపి ఉంచగలుగుతాం. మనసుని నిగ్రహించటానికి చాలా తేలిక మార్గం ఒకటుంది. శాంతంగా కూర్చో. మనసును దానిష్టం వచ్చినట్లు కొంతసేపు పోనివ్వు. ఈ మనసు తిరుగుతుంటే, దాన్ని చూస్తూ నిలిచిన సాక్షిని నేను. నేను నీ మనసును కాను అని గాఢంగా బావించు. 
 
ఆ తర్వాత ఆ మనసు నీకన్నా వేరని, నువ్వు దాన్ని చూస్తున్నట్లు అనుకో. నువ్వు పరమాత్మ అనుకో. శరీరం కానీ, మనసు కానీ, నీకన్నా వేరని భావించు. మనసు ఒక శాంతమైన సరస్సులా నీ ఎదుట ఉన్నట్లు, ఆ మనసులో ఉదయించే ఆలోచనలు ఆ సరస్సులో లేచిపడే బుడగలు లాంటివని భావించు. ఆ ఆలోచనలను నిరోధించటానికి ప్రయత్నించకు. వాటి పుట్టుక-విలీనాలను ఊరక సాక్షీభూతుడవై చూస్తుండు. చాలు. ఇలా చేస్తే, క్రమంగా ఆలోచనలు అణిగిపోతాయి. 
 
సరస్సులో ఒక రాయి విసిరితే, తరంగాలు పుట్టి క్రమంగా విశాలంగా వ్యాపించిపోతాయి. కాబట్టి మనోతరంగాలను నిరోధించాలంటే, వాటిలో పెద్ద తరంగాన్ని తీసుకుని దాన్ని క్రమంగా సంకుచితం చేస్తూ, చివరికి దాన్ని బిందుమాత్రంగా చేసి, అక్కడ మనస్సునంతా కేంద్రీకరించి నిలపాలి. నేను మనసును కాను. మానసిక యోచనను గమనించేవాడిని. నేను సాక్షిభూతుడను అని తెలుసుకోవాలి. అంటే ఆలోచించటాన్ని నేను చూస్తున్నాను. ఆ మనసు పని చేస్తుండగా నేను చూస్తున్నాను. అని నిరంతరం తలచాలి. 
 
కాలక్రమంలో అనుభవంతో మనోఆలోచనలు తగ్గుతాయి. చివరికి నువ్వు వేరని, మనసు ఒక సాధన మాత్రమేనని, అది నీకన్నా వేరని తెలుసుకుంటావు. ఈ భిన్నత్వాన్ని సాధించన తర్వాత మనసు నీకు వశమవుతుంది. దాన్ని నువ్వు సేవకునిలా నీ యిష్టం వచ్చినట్లు నిరోధించవచ్చు. యోగి కావటానికి ఇంద్రియాలను దాటటం మొదటి లక్షణం. మనస్సును జయించిన తర్వత యోగి ఉన్నత స్థితి పొందినట్లు గ్రహించాలి. ఆలోచనలు బొమ్మల్లాంటివి. కాబట్టి వాటిని మనం కల్పించుకోరాదు.
 
మనం చేయవలసినదల్లా మనస్సు నుండి వృత్తులను తొలిగించుట మాత్రమే. మనస్సు ఆలోచనరహితం చేయాలి. ఆలోచన పుట్టగానే దాన్ని త్రోసివేయాలి. ఈ ఫలితాన్ని దాటివేయాలి ఈ ప్రయత్నాన్ని చేయడానికి మాత్రమే మానవ జీవితం ఉంది. ప్రతి ధ్వనికి ఏదో ఒక అర్థం ఉంటుంది. శబ్దర్థాలు రెండూ మన స్వభావంలోనే సంబద్ధాలై ఉన్నాయి. మన చరమ లక్ష్యం పరమాత్మ. కాబట్టి పరమాత్మపై ధ్యానం చేయాలి.
 
ఈ సర్వ విశ్వం నా శరీరం. ఈ విశ్వంలో వున్న సుఖసంతోషాలన్నీ, ఉత్సాహమంతా, ఆరోగ్యమంతా నాదే. నేనే ఈ విశ్వాన్ని అని భావించు. చివరికి ఈ విశ్వంలో ప్రతిఫలిస్తున్న క్రియ అంతా మన నుండే పుడుతున్నదని మనం తెలుసుకుందాం. మనం పరమాత్మ అనే సముద్రంలో లేచే చిన్నచిన్న కెరటాల వంటి వారమైన మనకు అధారభూతంగా ఉంది మాత్రం సముద్రమే. ఆ మహాసముద్రనికి మనం వేరుగాలేము ఏ కెరటం కూడా దానికి వేరుగా వుండదు.
 
చక్కగా ఉపయోగిస్తే భావన మనకు ఎంతో మంచి ఉపకారం చేస్తుంది. అది బుద్ధిని దాటి మనల్ని కావలసినచోటకి కోనిపోయే వెలుగువంటిది. ఆత్మనుభూతి మనలోనే ఉంది. దాన్ని సాధించడానికి మన చేతిలో వున్న శక్తులను మనం ఉపయోగించుకోవాలి.
-రామకృష్ణ పరమహంస