మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (16:39 IST)

శ్రావణమాసం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే.. నవగ్రహాలు శాంతిస్తాయట

శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, వరలక్ష్మిదేవి వ్రతం ఇలా శ్రావణ మాసంలో చాలా పూజలు ఉంటాయి. శ్రావణ మాసం ఈసారి ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 7 వరకు శ్రావణమాసం ఉంటుంది. ఉపవాసం మొదలు పూజలు వరకు భక్తి శ్రద్ధలతో మహిళలు చేసి తమ ఇష్టదైవాన్ని కొలుస్తారు.
 
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిపై అలిగి వైకుంఠం వదిలి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటారు. అందుకని ఈ మాసంలో భక్తులు ఉపవాస దీక్ష లో పాల్గొని స్వామి వారికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే అలా వెళ్లిపోయిన అమ్మవారు తిరిగి అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు పాల కడలి నుండి ఆవిర్భవించినట్లు చెబుతూ ఉంటారు. 
 
అయితే అమ్మ వారి కంటే ముందుగా సముద్రం నుండి విషం బయటికి వచ్చినప్పుడు ఆ విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో బంధించాడు అని అంటారు. దీని కారణంగా ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి పెద్దఎత్తున పూజలు చేస్తారు. శ్రావణమాసంలో ప్రత్యేకంగా పూజలు చేసి నోములు చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు కలిగి ఆనందంగా ఉంటారని భక్తుల నమ్మకం.
 
ఈ నెల గృహ నిర్మాణాన్ని మొదలుపెట్టేందుకు మంచిదని మత్స్యపురాణం చెబుతోంది. ప్రతి సోమవారం మహా లింగార్చన ఉంటుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును, శివుడిని కూడా పూజిస్తారు. భక్తులు మనసుతో ఆరాధిస్తే నవగ్రహాలు శాంతిస్తాయని పండితులు చెబుతున్నారు. 
 
ఈ పక్షంలోని ఒక్కో రోజు, ఒక్కో దేవుడికి పూజ చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. పాడ్యమి రోజు బ్రహ్మదేవుడు, విదియ- -ప్రియవతి, తదియ -పార్వతీదేవి, చవితి- వినాయకుడు, పంచమి-శశి, షష్ఠి-నాగ దేవతలు, సప్తమి- సూర్యుడు, అష్టమి- దుర్గాదేవి, నవమి -మాతృదేవతలు, దశమి -ధర్మరాజు, ఏకాదశి- -మహర్షులు, ద్వాదశి- శ్రీమహావిష్ణువు, త్రయోదశి- అనుంగుడు, చతుర్దశి-పరమశివుడు, పూర్ణిమ-పితృదేవతలకు పూజలు చేస్తే ఎలాంటి సమస్యలు రావని, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని పురాణాల్లో ఉంది. శ్రావణ మాసంలో కొత్త పెండ్లికూతుళ్లు ఈ వ్రతాల్ని ఆచరించడం అన్ని విధాల మంచిదని చెబుతారు.
 
ఏడాది మొత్తంలో ఒక్క శ్రావణంలోనే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాలతో అతిసార, డయేరియా, మలేరియా వంటి అంటు వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఆధ్యాత్మికత పేరుతో పరిసరాల పరిశుభ్రత పాటించడం, శాకాహారం తీసుకోవడం, ఉపవాసాలు చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి, రోగాలు రాకుండా ఉంటాయని చెప్తారు.