మంగళవారం, 21 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (08:03 IST)

గణపతి పూజ ఎలా చేయాలి.. కావాల్సిన సామాగ్రి ఏంటి?

సాధారణంగా ప్రతి ఒక్క హిందువు ఎలాంటి కార్యం తలపెట్టినా ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ఉండేందుకు ఆదిదేవుడుగా భావించే వినాయకుడికి పూజ చేస్తారు. అన్ని దేవుళ్ల కంటే వినాయకుడికి పూజ చేస్తారు. భాద్రపద చవితి నాడు గణపతి పుట్టినందుకు ఆ రోజే వినాయక చవితిగా ప్రసిద్ధి. 
 
ఈ రోజు నుంచి నవరాత్రులు స్వామి వారిని పూజించి భక్తులు ఆశీస్సులు పొందుతుంటారు. పూజ ఎలా చేయాలంటే.. ముందుగా సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి.
 
ఈ పూజ కోసం ఉపయోగించే సామాగ్రి ఏంటో ఓసారి పరిసీలిస్తే, గణపతి మట్టి ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, బియ్యం, రెండు దీపపు కుందులు, వత్తులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, కొబ్బరికాయలు, కలశం, ఆచమన పాత్రలు, మూడు ఉద్ధరిణలు, ఆచమనానికి ఒక పళ్లెం, 21 రకాల పత్రి, నైవేద్యానికి పండ్లు, వివిధ రకాల పూలు, తమలపాకులు, యజ్ఞోపవీతం
 
ముందుగా పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీటమీద కొద్దిగా బియ్యం పరిచి, పూర్ణకుంభంలో కొత్త బియ్యం వేసి, వినాయకుడి విగ్రహం పెట్టి అలంకరించాలి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేత గడ్డి ఆకులు, పూలు, పండ్లతో పాలవెల్లి అలంకరించాలి. గొడుగు పెట్టాలి.
 
నేతితో చేసిన 12 రకాల వంటకాలు. వీలు కాకపోతే శక్తి మేరకు రకరకాల పిండి వంటలు చేయవచ్చు. ఉండ్రాళ్లు, పాయసం గణపతికి ఇష్టమైన నైవేద్యం. ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార వంటి వాటిని వినియోగిస్తారు. 
 
పూజను ఎలా చేయాలి?
ఓం శ్రీ మహాగణాధిపతయే నమ: అని చెప్పి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే.. శ్లోకం చదివి పూజను ప్రారంభించాలి. ముందుగా ఆచమనం.. ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీళ్లు పోసుకొని తాగాలి. తర్వాత గణపతికి నమస్కరించి దైవ ప్రార్థన చేయాలి. ఇందులో భాగంగా.. భూతోచ్చాటన, ప్రాణాయామం, సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత షోడశోపచార పూజ చేయాలి. 
 
అనంతరం పుష్పాలతో పూజిస్తూ అథాంగ పూజ నిర్వహించాలి. 21 రకాల పత్రాలతో ఏకవింశతి పత్ర పూజ చేయాలి. ఆ తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి జపించాలి. అథ దూర్వాయుగ్మ పూజ చేస్తూ నమస్కారం చేయాలి. పూజ పూర్తయ్యాక గణపతి వ్రత కథను వినాలి లేదా చెప్పుకోవాలి. వినాయక చవితి పద్యాలు చదవాలి. అనంతరం మంగళహారతి పట్టుకొని దీపాన్ని గణపతికి చూపిస్తూ మంగళాచరణాలు ఆలపించాలి. చివరగా గణపతి ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్ఠాంగ నమస్కారం చేయాలి.