గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 2 జనవరి 2018 (20:18 IST)

టిటిడి ఉన్నతాధికారుల మరో సంచలన నిర్ణయం.. ఏంటది?

త్వరలో శ్రీవారి దర్శన టికెట్ల రేట్లు పెంపచేందుకు రంగం సిద్దం చేసింది టీటీడీ. ఆన్‌లైన్ రూ.300 టికెట్లు మినహా అన్ని దర్శన, సేవా టికెట్ల ధరలు పెరగబోతున్నాయి. ఇప్పటికే లడ్డూలు, వడలు తదితర ప్రసాదాల రేట్లను పెంచిన అధికారులు, ఇక నుంచి వీఐపీ దర్శన టికెట్లతో

త్వరలో శ్రీవారి దర్శన టికెట్ల రేట్లు పెంపచేందుకు రంగం సిద్దం చేసింది టీటీడీ. ఆన్‌లైన్ రూ.300 టికెట్లు మినహా అన్ని దర్శన, సేవా టికెట్ల ధరలు పెరగబోతున్నాయి. ఇప్పటికే లడ్డూలు, వడలు తదితర ప్రసాదాల రేట్లను పెంచిన అధికారులు, ఇక నుంచి వీఐపీ దర్శన టికెట్లతో పాటూ అన్ని సేవల రేట్లు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన టీటీడీ అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు చేసేందుకు రెడీగా ఉంది. 
 
ఇప్పటికే జీఎస్టీ సాకుతో వసతి గదులు, లడ్డూల రేట్లను పెంచిన టీటీడీ తాజాగా మరో అంశంపై దృష్టి సారిస్తోంది. ఈసారి వీఐపీ దర్శన, సేవా టికెట్లు ధరలు భారీగా పెంచేందకు సిద్ధమయ్యారు అధికారులు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వ ఆమోదముద్ర అనంతరం పెరిగిన రేట్లను అమలు చేయాలని భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా దర్శన టికెట్ల రేట్లను పెంచాలని టీటీడీ భావిస్తోంది. 
 
అనేకసార్లు ప్రతిపాదన టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చకు వచ్చినా సభ్యుల వ్యతిరేకతతో ఆగిపోయింది. అయితే కొన్ని నెలలుగా తితిదే బోర్డు లేకపోవడం అధికారులకు కలసివస్తోంది. కొత్త పాలక మండలి ఏర్పడే లోపే దర్శన టికెట్లు పెంచేస్తే ఓ పనైపోతుందని భావిస్తున్నారు అధికారులు. అయితే ఆన్ లైన్ మూడు వందలు, ఆన్ లైన్ లో సులభంగాలభించే కొన్ని అర్జిత సేవల మినాహా డిమాండ్ ఉన్న అన్నిరకాల దర్శన టికెట్ల రేట్లును భారీగా పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం.
 
టీటీడీ పెంచబోయే ధర్శన టికెట్ల అంశంగా ప్రధానంగా వీఐపీ బ్రేక్ టికెట్లు ముందువరసలో ఉన్నాయని చెప్పచ్చు. వీఐపీ దర్శన టికెట్లకు రోజురోజుకు పెరుగుతున్నడిమాండ్‌కు ప్రముఖుల నుంచి వస్తున్న వత్తిడిల నుంచి గట్టెక్కాలన్నా వీటి ధరలను భారీగా పెంచడమే మార్గంగా భావిస్తున్నారు అధికారులు. వీఐపీ దర్శన టికెట్లను మూడు విభాగాలుగా సిఫారసులపై భక్తులకు ఇస్తారు అధికారులు. ఎల్ 1, ఎల్2, ఎల్3లుగా పిలిచే విఐపీ దర్శన టికెట్లలో శ్రీవారిని అతి దగ్గరకా ఎక్కువసేపు దర్శనం చేసుకోవడంతో పాటూ హారతి అందుకునే అవకాశం ఎల్1కు మాత్రమే ఉంటుంది.
 
అనంతరం ప్రాధాన్యం ఎల్2 ఎల్3లకు ఉంటుంది. దీంతో వీఐపీ టికెట్ల కోసం నిత్యం జేఈఓ కార్యాలయానికి వందలాది ప్రముఖుల నుంచి వత్తిడిలు వస్తుంటాయి. ఈ వత్తిళ్లను తట్టుకోవడం అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో ఎల్ 1 టికెట్ల ధరను 500 వందల నుంచి 5 వేలకు, ఎల్ 2 ధరను 2 వేలకు ఎల్3 ధరను వెయ్యి లేదా యధాతథంగా ఉంచాలన్న ఆలోచనతో ఉన్నారు అధికారులు.
 
కేవలం వీఐపీ దర్శన టికెట్లు మాత్రమే పెంచితే భక్తుల దృష్టి ఇతర సేవా టికెట్లపై పడే అవకాశం కూడా ఉంది. దీంతో ఎన్నో ఏళ్లుగా పాత రేట్లే అమలు అవుతన్న సుప్రభాతం, తోమాల, అర్చన లాంటి నిత్య సేవా టికెట్లతోపాటూ కొన్ని రకాల అర్జిత సేవల ధరలనూ పెంచాలని భావిస్తున్నారు అధికారులు. దర్శన టికెట్ల రేట్లను పెంచడం ద్వారా టీటీడీకి ఆదాయంతో పాటూ తిరుమలలో మాఫియాగా మారిన దళారి వ్యవస్థను అరికట్టచ్చన్నధి అధికారుల ఆలోచన. 
 
ఒకప్పుడు కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే ఇచ్చే వీఐపీ ధర్శన టికెట్లను ప్రస్తుతం ఎవరికిపడితే వారికి ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఇప్పటితో పోలిస్తే గతంలో అర్చనానంతరం దర్శనం, సెల్లార్ దర్శనం లాంటి ఇతర ప్రత్యామ్నాయ దర్శన అవకాశాలు ఉండేవి. దీంతో వీఐపీ దర్శన టికెట్లు పొందలేకపోయినా ఏఏడీ, సెల్లార్ వంటి దర్శన టికెట్లతో సంతృప్తి పడేవారు. అయితే అనంతర కాలంలో వాటిని రద్దు చేయడంతో ఇపుడు అందరి దృస్టీ వీఐపీ దర్శన టికెట్లపైనే ఉంటోంది. దీంతో వీఐపీ దర్శన టికెట్ల కోసం వత్తిళ్లు తగ్గాలంటే వాటి ధరలను అమాంతంగా పెంచేయడమే మార్గంగా భావిస్తోంది టీటీడీ. 
 
అయితే గతంలోనూ అనేకసార్లు దర్శన టికెట్ల ధరలను పెంచాలని భావించినా అమలు చేయలేక పోయారు అధికారులు. దీనికి తోడు రాజకీయ నాయకులతో బోర్డు నిండిపోవడంతో భక్తుల నుంచి వ్యతిరేకత, చెడ్డపేరు వస్తుందన్న భయంతో బోర్డు కూడా ఒప్పుకోలేదు. అయితే ప్రస్తుతం పాలక మండలి లేకపోవడం అధికారులకు కలసి వచ్చే అంశంగా చెప్పచ్చు. దీనికితోడు జీఎస్టీ సాకుగా చేసుకుని వసతి గదులు, లడ్డూల ధరలను పెంచేసిని అధికారులు అదే కోవలో దర్శన టికెట్లు రేట్లనూ పెంచేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖ పరిశీలనలో ఉన్న దర్శన టికెట్ల రేట్ల పెంపు అంశం ప్రభుత్వం ఓకే చెబితే త్వరలోనే అమలు చేసేందకు సిద్ధంగా ఉన్నారు టీటీడీ అధికారులు.