మూడు వక్షోజాలతో మదుర మీనాక్షి ఎందుకు జన్మించింది, చరిత్ర ఏమిటి?
మదుర మీనాక్షి. మీనాక్షి అమ్మవారి చరిత్ర చాలా విభిన్నంగా వుంది. మదుర మీనాక్షి ఆలయంలో అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో మూడు వక్షోజాలతో ఓ దేవతామూర్తి కనబడతారు. ఈ శిల్పం ఆకృతి అలా ఎందుకు వున్నదన్న విషయంపై ఓ చరిత్ర వుంది. పురాణాలలో తెలిపిన వివరాల ప్రకారం.. మలయధ్వజ ఆయన భార్య తమకు కుమారుడు కావాలని యజ్ఞం చేసారు. వారలా యజ్ఞం చేస్తుండగా అగ్ని నుంచి మూడేళ్ల వయసున్న పాప జనించింది. ఆ బాలికను వారు సాక్షాత్తూ పార్వతీదేవిగా భావించి ఆమెకు మీనాక్షి అని నామకరణం చేసారు.
ఆ బాలిక నేత్రాలు మీనాల్లో వుండటమే కాకుండా ఆమెకి మూడు స్తనాలు కూడా వున్నాయి. బాలికకు మూడు స్తనాలు వుండటం చూసి తల్లిదండ్రులు ఆవేదన చెందారు. ఆ సమయంలో ఆకాశవాణి నుంచి మీ కుమార్తెకి తగిన వరుడు లభించినప్పుడు మూడో వక్షస్థలం అంతర్థానమవుతుందనే మాటలు వినిపించాయి. ఇదిలావుండగా పెరిగి పెద్దదైన మీనాక్షి ధైర్యసాహసాలతో ప్రపంచాన్నే జయించాలను కోరుకున్నది.
ఆ ప్రకారంగా ముల్లోకాలను జయించి కైలాసం వైపు పయనించడం ప్రారంభించింది. అలా పయనిస్తున్న ఆమెకి ఓ సాధుపుంగవుడు ఎదురుపడ్డాడు. ఆయనకు సమీపించిన వెంటనే తనలోని మూడో వక్షస్థలం మాయమైపోయింది. దానితో ఆ వచ్చిన సాధువు సాక్షాత్తూ శివుడని గుర్తించింది. తను కూడా మీనాక్షి దేవి రూపంలో వున్న పార్వతిగా గుర్తించింది. సాధువుగా వున్న అతడి పేరు సుందరేశ్వరుడు కాగా మీనాక్షి దేవి అతడిని వివాహం చేసుకున్నది. వారి వివాహం మదురైలో అంగరంగవైభవంగా జరిగింది. అలా మదుర మీనాక్షి కొలువైనారు.