శ్రీరామ లవకుశుల యుద్ధభూమి.. వకుళ వృక్షం.. శిరువాపురి.. ఎక్కడ?
Siruvapuri Murugan Temple
లవకుశులు శ్రీరామునితో యుద్ధం చేసిన భూమి.. శిరువాపురి. ఈ శిరువాపురిలోనే శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వెలసి వుంది. ఈ ఆలయంలోని సుబ్బయ్యను పూజించడం ద్వారా కోరిన కోరికలు ఇట్టే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సొంతింటి కలను ఈ సుబ్రహ్మణ్యుడు తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మకం.
సొంతింటి కల సాకారం అయ్యేందుకు ఎందరో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. చేతిలో ధనం వున్నా చాలామందికి సొంతింటి కల నెరవేరడం కష్టం అవుతుంది. అలాంటివారు శిరువాపురి సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే తప్పకుండా ఫలితం వుంటుంది. శిరువాపురికి వెళ్ళి మనస్ఫూర్తిగా స్వామిని స్తుతిస్తే సొంతింటి కలే కాదు.. అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
చెన్నై నుంచి రెడ్ హిల్స్ లేదా కారనొడై ద్వారా లేకుంటే మీంజూర్, పొన్నేరి మార్గం ద్వారా శిరువాపురి చేరుకోవచ్చు. అలా కాకుంటే తిరుపతికి వెళ్లే మార్గంలోని పెద్దపాళయం నుంచి ఆటో లేదా బస్సుల ద్వారా శిరువాపురి చేరుకోవచ్చు.
రామాయణ కాలంలో రామునికి లవకుశులకు ఈ ప్రాంతంలోనే యుద్ధం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. పంటపొలాల పచ్చదనం మధ్య శిరువాపురి ఆలయం నెలకొని వుంది.
Siruvapuri Murugan Temple
ఈ ఆలయంలో రాజగణపతి, అరుణాచలేశ్వర్, అభిత కుచలాంబాల్, సూర్యుడు, చండీకేశ్వరుడు, నాగస్వామి, ఆదిమూలవర్, నవగ్రహాలు, కాలభైరవుడు, అరుణ గిరి నాథర్, మయూర నాథర్ వంటి స్వాములకు ప్రత్యేక సన్నిధానాలు వున్నాయి.
ఎత్తైన రాజ గోపురం, ధ్వజస్తంభాన్ని కలిగి వుండటం ఈ ఆలయంలో ప్రత్యేకత. అరుణ గిరి నాథర్ తన తిరుప్పుగళ్‌లో ఈ శిరువాపురి గురించి పాడి వున్నారు. ఇక గర్భాలయంలోని సుబ్బయ్య స్వామి ఎత్తు నాలుగున్నర అడుగులు.
గర్భగుడిలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం మినహా.. మిగిలిన అన్నీ విగ్రహాలు మరకత పచ్చరాతితో చేసినవి కావడం విశేషం. ఇలాంటి ఆలయాన్ని వేరెక్కడా చూడలేం. ఈ స్థల వృక్షం వకుళ వృక్షం. ప్రేమ, అందం, సువాసనలకు కూడలి వకుళ వృక్షం.
శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలో బృందావనంలో ఈ చెట్టు క్రిందనే గోపకాంతలకు తన వేణుగానంతో అనురాగం పంచాడని చెబుతారు. అలాంటి మహిమాన్వితమైన వకుళ వృక్షం ఈ ఆలయంలో వుండటం విశేషం. సొంతిళ్లు, ఇంటి సంబంధిత సమస్యలు, భూ వివాదాలు పరిష్కారం కావాలంటే.. శిరువాపురిని సందర్శించుకోవాల్సిందే.
అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా.. శిరువాపురి కుమారస్వామిని దర్శించుకోవడం ద్వారా పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.