సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (23:51 IST)

కరోనా వైరస్ అలా పోవాలని, తిరుమలలో ధన్వంతరి మహామంత్ర పారాయణం

లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ధన్వంతరి మహామంత్రం పారాయణం చేస్తున్నామని టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో నాదనీరాజనం వేదికపై ఈరోజు ఉదయం యోగవాశిస్టం, శ్రీ ధన్వంతరి మహామంత్రం పారాయణం ప్రారంభమైంది. 
 
ఈ సంధర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి అరికట్టాలని స్వామివారిని కోరుకుంటూ గత 20 రోజుల నుంచి తిరుమలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి 16 నుంచి 25వ తేదీ వరకు శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపపయజ్ఞం, మార్చి 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం నిర్వహించామని వివరించారు.
 
యోగవాశిష్టం ధన్వంతరి మహామంత్రం పారాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు పఠించి ఉపశమనం పొందవచ్చునని, ప్రస్తుతం ఎస్వీబీసీలో ప్రసారం చేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 45 నిమిషాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.