శ్రీనివాసుని పుష్పాలతో అగరబత్తీలు, శ్రీవారి భక్తులకు అందుబాటులో ఎప్పుడు వస్తుందంటే..?
ఈనెల 17 నుంచి టీటీడీ అగరబత్తులు శ్రీ వారి భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ ఆలయాల్లో స్వామివారికి అభిషేకించే పుష్పాలతో ఆరు రకాల అగరబత్తీలను తయారు చేస్తున్నారు అధికారులు. తిరుమల శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనం లడ్డూతో పాటు ఇకపై మరో వస్తువు కూడా అందుబాటులోకి రానుంది. అదే స్వామివారి అలంకరణకు వినియోగించే స్వామివారి అలంకరణకు ఉపయోగించే పరిమళాలను వెదజల్లే అగరబత్తీలు. ఇప్పటివరకు పుష్పాలను అలంకరించిన తర్వాత వాటిని బావిలో వృథాగా పడేస్తోంది టిటిడి.
అయితే వాటిని ఉపయోగించి అగరబత్తీలను భక్తుల కోసం తయారుచేయాలని టిటిడి నిర్ణయించుకుంది. బెంగుళూరుకు చెందిన కంపెనీ సహాయంతో తిరుపతికి చెందిన డైరీలో అగరబత్తీల తయారీని ప్రారంభించింది టిటిడి. ఈ అగరబత్తీలను ఆగస్టు 17వతేదీ భక్తులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటోంది. టిటిడి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 50కిపైగా ఆలయాలు ఉన్నాయి. ఏటా ఆలయాల్లో జరిగే పుష్పయాగం సమయంలో టన్నుల కొద్దీ పువ్వులను ఉపయోగిస్తారు.
ఇవన్నీ వృధా కాకుండా వాటి వినియోగంపై దృష్టి సారించింది టిటిడి. ఇలా అగరబత్తీల తయారీకి శ్రీకారం చుట్టింది. స్వామివారికి అలంకరించిన పుష్పాలతో అగరబత్తీలు తయారు చేస్తే భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు. వీటి విక్రయాల ద్వారా లభించిన ఆదాయాన్ని గోసంరక్షణకు వినియోగించాలన్న ఆలోచనలో ఉంది టిటిడి.